Advertisement

గాంధీ ఆసుపత్రిలో ఏం జరుగుతోంది?

Posted : June 11, 2020 at 7:11 pm IST by ManaTeluguMovies

కరోనాపై పోరులో తెలంగాణ ప్రభుత్వం మిగతా రాష్ట్రాలకంటే ముందుందని సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారీ గొప్పలు చెప్పారంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. మిగతా రాష్ట్రాల కంటే తక్కువ టెస్టులు చేస్తున్నారని…అసలు టెస్టుల సంఖ్య కూడా బయటపెట్టడం లేదని విపక్షాలు విమర్శలు గుప్పించాయి.

అవసరమైతేనే టెస్టులు చేస్తామని….లక్షణాలు లేకుంటే టెస్టులెందుకని ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను విపక్షాలు తప్పుబట్టాయి. తెలంగాణలోని ఆసుపత్రుల్లో మాస్కులు, పీపీఈల కొరత ఉందని…గాంధీలో కరోనా రోగులను పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు చెబుతున్నా….ప్రభుత్వం ఆ వ్యాఖ్యలను రాజకీయ కోణంలోనే చూసింది.

చివరకు జర్నలిస్ట్ మనోజ్ చనిపోయిన తర్వాత గాంధీ ఆసుపత్రిలో ఏం జరుగుతోందన్న విషయం బయట ప్రపంచానికి తెలిసింది. కోవిడ్ ఆసుపత్రి అయిన గాంధీ ఆసుపత్రిలో కరోనా రోగులకు కనీస సౌకర్యాలు లేవంటూ మనోజ్ వెల్లడించడంతో తెలంగాణ ఉలిక్కిపడింది.

తాజాగా కరోనాతో ఆసుపత్రిలో చేరిన మరికొందరు జర్నలిస్టులు తమకు అన్నం కూడా పెట్టడం లేదంటూ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. దీనికితోడు, జూనియర్ డాక్టర్ల మెరుపు ధర్నాతో గాంధీ ఆసుపత్రి ఇపుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది.

తన సోదరుడు మనోజ్ మృతికి.. గాంధీ వైద్యులు సకాలంలో స్పందించకపోవడమే కారణమంటూ ఆయన సోదరుడు ఆరోపించారు. కోవిడ్ కోసం కోట్లు ఖర్చుపెడుతున్నామని కేసీఆర్ చెబుతున్నారు. అయితే, తమకు కనీసం మంచినీరు, అన్నం కూడా పెట్టడం లేదని సాక్ష్యాత్తూ జర్నలిస్టులు ఆధారాలు చూపుతున్నారు.

దీంతో, గాంధీ ఆసుపత్రిలో ఏం జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, గాంధీలో కాలుజారి ఓ రోగి మరణించాడు. దీనికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని…బంధువులు డాక్టర్లపై దాడి చేశారు. దీంతో, జూ.డాలు ధర్నాకు దిగారు.

తెలంగాణకు ఒక సీఎం చాలని…కానీ, కోవిడ్ కేసులకు ఒక్క గాంధీ ఆసుపత్రి చాలదని డాక్టర్లు ప్లకార్డులు పట్టుకున్నారు. డాక్టర్లకు సంఘీభావంగా తెలంగాలోని అన్ని జిల్లాల్లో జూనియర్ డాక్టర్లు ధర్నాలు చేస్తున్నారు. జూ.డాలకు సర్దిచెప్పేందుకు ఈటల గాంధీకి వచ్చి చర్చలు జరిపారు.

మరోవైపు, గాంధీలో విధులు నిర్వర్తిస్తున్న ఓ పోలీసు అధికారికి కరోనా సోకింది. దీనిని బట్టి గాంధీలో వైద్యులు, విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిపై ఎంత ఒత్తిడి ఉందో అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే జర్నలిస్టు మృతి చెందాడని మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు.

మృతి చెందిన జర్నలిస్టు కుటుంబానికి, 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఒక్కో జర్నలిస్టులకు నెలకు 10 వేల రూపాయల సాయం చేయాలని, 50 లక్షల రూపాయల బీమా కల్పించాలన్నారు. గాంధీలో వైద్యులకు- రోగులకు రక్షణ లేకుండా పోతే, ఇక కేసీఆర్ సర్కారు ఏం చేస్తోందని నిలదీశారు.


Advertisement

Recent Random Post:

కోనసీమ జిల్లా మండపేట మండలం ఏడిదలో దారుణం.. | Konaseema District

Posted : November 1, 2024 at 1:10 pm IST by ManaTeluguMovies

కోనసీమ జిల్లా మండపేట మండలం ఏడిదలో దారుణం.. | Konaseema District

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad