ఎప్పుడో పార్టీ మారాల్సిన వ్యక్తి టీడీపీ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. అదికారం లేకుండా ఎక్కువకాలం ఏ పార్టీలోనూ వుండలేరాయన. కానీ, అనూహ్యంగా గంటా శ్రీనివాసరావుకి రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వైసీపీలోకి వెళ్ళాలనుకుంటే అక్కడా సమస్యలే.. పోనీ, బీజేపీ వైపు దూకేద్దామా.? అంటే అక్కడా సమస్యలే. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వ్యవహారంలో గంటా ‘గోడ దూకేయాలని’ ప్లాన్ చేశారుగానీ, వర్కవుట్ కాలేదు. ప్రస్తుతానికి ఆయన ఎమ్మెల్యేగానే వున్నారు.. కానీ, రాజకీయంగా పూర్తి స్తబ్దత పాటిస్తున్నారు. అనూహ్యంగా ఆయనకిప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం కలిసొచ్చింది. ‘ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..’ అని ఇటీవలే గంటా శ్రీనివాసరావు ప్రకటించారు.
ఈ రోజు రాజీనామా చేసేశారు కూడా. ఇది అనూహ్యమైన పరిణామమే. రాజకీయ నాయకులు చెప్తారు, కానీ చెయ్యరు.! రాజీనామా పేరుతో ఎన్నెన్ని డ్రామాలు పొలిటికల్ లీడర్స్ ఆడుతారనేది టీడీపీ హయాంలో ప్రత్యేక హోదా కోసమంటూ రాజీనామాలు చేసిన వైసీపీ ఎంపీల తీరుతో అందరికీ ఇంకోసారి బాగా అర్థమయిపోయింది. ఇక, గంటా రాజీనామాపై స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకోవాల్సి వుంది. ఆయన ఎటూ రాజీనామా ఆమోదించకపోవచ్చు. ఎందుకంటే, గంటా రాజీనామాతో రాష్ట్రంలో రాజకీయ అలజడి మొదలవుతుంది. ఆ అలజడి అధికార పార్టీకి ముప్పుగా మారొచ్చు. స్పీకర్ రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలన్నది పాత మాట. అసలు రాజకీయం స్పీకర్ చుట్టూనే తిరుగుతోందని తెలంగాణ ఉద్యమం నేపథ్యంలోనే అందరికీ మరింత బాగా అర్థమయ్యింది.
గంటా రాజీనామా ఆమోదం పొందినా, పొందకపోయినా.. ఆయన రాజీనామా ఇంపాక్ట్ మాత్రం చాలా గట్టిగానే వుండబోతోంది ఏపీ రాజకీయాల్లో. వైసీపీకి చెందిన ఓ ఎంపీ, ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సైతం ‘రాజీనామాలకు మేం సిద్ధం’ అని నిన్ననే ప్రకటించిన దరిమిలా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించనుందన్నది నిర్వివాదాంశం. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గంటా, నాన్ పొలిటికల్ జేఏసీని ఏర్పాటు చేస్తాననడం మరో కీలక అంశమిక్కడ. అంటే, మరోమారు విశాఖలో పవర్ సెంటర్‌గా తన సత్తా చాటాలని గంటా డిసైడ్ అయ్యారన్నమాట. మరి, ఆయనకు అంత సీన్ వుందా.? వేచి చూడాల్సిందే.