ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ హైకోర్టు ధర్మానసం ముందు మరోసారి హాజరుకానున్నారు. ఈమేరకు హైకోర్టు ఆయనకు ఆదేశాలు జారీ చేసింది. లాక్ డౌన్ సమయంలో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను పోలీసులు తమకు అప్పగించడం లేదంటూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. ఎక్సైజ్ యాక్ట్ కింద నిబంధనలు పాటించని అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారో మంగళవారం చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదిని సోమవారం ఆదేశించింది. కానీ.. ఈరోజు ఆయన సమాధానం చెప్పకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. నేరుగా డీజీపీనే బుధవారమే హాజరై ఈ మేరకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
ఇటివల అక్రమ మద్యం తరలింపు కేసుల్లో వేల సంఖ్యలో వాహనాలను సీజ్ చేశారు. ఏపీ ఎక్సైజ్ 34(ఏ) సెక్షన్ కింద ఈ వాహనాలను మేజిస్ట్రేట్ లేదా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ముందు హాజరు పరచాల్సి ఉండగా.. అలా జరగడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. వాటిని పోలీస్ స్టేషన్లలోనే ఉంచేయడంతో ఎండ, వానలకు పాడైపోతున్నాయని వాహనదారులు ఆరోపిస్తున్నారు. చట్టబద్దంగా వాహనాలను విడిపించుకునేందుకు పోలీసులు సహకరించడం లేదని అంటున్నారు.
నిబంధనలకు అనుగుణంగా మద్యం బాటిళ్లను తీసుకెళ్తున్నా వాహనాలను స్వాధీనం చేసుకున్నారని పలువురు తమ పిటిషన్లలో పేర్కొన్నారు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. డీజీపీ హైకోర్టులో హాజరవడం ఇది మూడోసారి. గతంలో అక్రమ నిర్బంధం కేసులో ఓసారి, మరోసారి చంద్రబాబు విశాఖ పర్యటన సందర్భంగా జరిగిన ఘటన నేపథ్యంలో ఆయన హాజరయ్యారు.