తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత మృతితో వచ్చిన ఉప ఎన్నికల్లో తమిళ హీరో విశాల్ పోటీ చేసేందుకు సిద్దం అయ్యాడు. ఆ సమయంలో విశాల్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అయితే నామినేషన్ వేసిన తర్వాత అనూహ్యంగా అతడికి షాక్ తగిలింది. ఆ సమయంలోనే విశాల్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి. విశాల్ సొంత పార్టీ పెట్టడం ఖాయం అనుకుంటూ ఉండగా అతడు సైలెంట్ అయ్యాడు. ఆ సమయంలో హడావుడి చేసిన విశాల్ రాజకీయాలపై చాలా ఆసక్తిగా ఉన్నట్లుగా క్లీయర్ గా ఆ సమయంలోనే తేలిపోయింది. కాని ఇప్పటి వరకు రాజకీయ పార్టీ గురించి ప్రస్థావించలేదు. అయిదు ఏళ్లు అవుతున్నా కూడా విశాల్ మళ్లీ ఎప్పుడు కూడా రాజకీయాల గురించి పట్టించుకున్న దాఖలాలే లేవు.
తాజాగా ఈయన నటించిన ఎనిమి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ప్రమోషన్ సందర్బంగా మరోసారి రాజకీయాల గురించి ప్రస్థావించాడు. మళ్లీ రాజకీయాల్లోకి ఎప్పుడు ఎంట్రీ అంటూ మీడియా అడిగిన సమయంలో అతడి నుండి స్పష్టమైన సమాధానం రాలేదు. కాని రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు లేవు అని మాత్రం చెప్పలేదు. ఆయన మాట్లాడుతూ పూర్తి స్థాయి రాజకీయాలపై నాకు ఇప్పుడు ఆసక్తి లేదు. ప్రస్తుతం నా పూర్తి దృష్టి సినిమాలపైనే ఉంది. నేను సినిమాలు చేస్తున్న సమయంలో రాజకీయంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో వాటిని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉంటాను. కాని రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశ్యం మాత్రం ప్రస్తుతం నాకు లేదు అంటూ చెప్పుకొచ్చాడు.
పైన దేవుడు అనుగ్రహించాలి.. కింద పరిస్థితులు అనుకూలించాలి అప్పుడే రాజకీయ అరంగేట్రం ఉంటుంది. ఆ పరిస్థితులు ఎప్పుడు వస్తాయో నాకు కూడా తెలియదు అన్నట్లుగా విశాల్ చెప్పుకొచ్చాడు. ఆ రెండు కలిసి వస్తే నేను నా ప్రమేయం లేకుండానే రాజకీయాల్లోకి వెళ్తానేమో అంటూ విశాల్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు పూర్తిగా సినిమాలు చేయడంపైనే దృష్టి పెట్టినట్లుగా చెప్పుకొచ్చాడు. హీరోగా నటించడంతో పాటు సినిమాలను నిర్మించడంలో కూడా బిజీగా ఉన్న విశాల్ ముందు ముందు మరిన్ని సినిమాలతో తమిళ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తానంటున్నాడు. తెలుగు లో కూడా మంచి గుర్తింపు ఉన్న విశాల్ ఇక్కడ కూడా సినిమాలు చేయాలనే ఆలోచనతో ఉన్నాడట. అది ఎప్పుడు అనేది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.