డాక్టర్ సుధాకర్ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం… వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో ఒకరిద్దరు వైసీపీ నేతలు, కోర్టుకు దురుద్దేశ్యాలు ఆపాదించేందుకూ ప్రయత్నించారు. సోషల్ మీడియాలో అయితే కుప్పలు తెప్పలుగా హైకోర్టు తీర్పుని ప్రశ్నిస్తూ పోస్టులు దర్శనమిచ్చాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది.
వైసీపీ నేతలు ఆమంచి కృష్ణమోహన్, నందిగం సురేష్ సహా మొత్తం 49 మందికి న్యాయస్థానం నోటీసులు పంపింది. న్యాయస్థానాల తీర్పుల్ని సవాల్ చేసే అవకాశం వుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయా తీర్పుల విషయమై సుప్రీం కోర్టుని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈలోగా నేతలు కావొచ్చు, పార్టీ మద్దతుదారులు కావొచ్చు అత్యుత్సాహం ప్రదర్శిస్తుండడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.
కాగా, కోర్టుల తీర్పులకు వక్రభాష్యాలు చెబుతున్నారంటూ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తెలుగుదేశం పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. వైసీపీ నేతలు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనంటూ హైకోర్టు తాజాగా వైసీపీ నేతలకు నోటీసులు పంపడంపై టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
విశాఖలో సంచలనం రేపిన డాక్టర్ సుధాకర్ ఘటనకు సంబంధించి కేసుని రాష్ట్ర హైకోర్టు సీబీఐ విచారణకు అప్పగిస్తూ ఇటీవల తీర్పునిచ్చింది. అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడాన్ని కూడా న్యాయస్థానం తప్పుపట్టింది. హైకోర్టు తీర్పుని అమలు చేయకుండా అదనపు రంగులు జోడించడాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించిన సంగతి తెల్సిందే.