ఆస్తులు, అంతస్తులు, బంధాలు అనుబంధాలు…ఇలా అన్నీ కోల్పోయిన క్షణంలో మనిషిని మనిషిగా నిలిపేది ఆత్మ విశ్వాసం, ఆత్మ స్థైర్యమే. ఆ రెండు కోల్పోయిన వాళ్లకు…మిగిలినవి ఎన్ని ఉన్నా ప్రయోజనం లేదు. అందుకే ఆత్మ విశ్వాసాన్ని, ఆత్మ స్థైర్యాన్ని ఓ ఆయుధంతో పోల్చుతారు.
బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్‌తో చిన్న వయస్సులో మృతి చెందడంతో లోకమంతా కన్నీరు పెట్టుకుంది. ఆయన నటనకు అభిమానులమైన మనకే అంత దుఃఖం కలిగిస్తే…జీవితాన్ని పంచుకున్న భార్య పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలమా?
కానీ ఇంత కష్టకాలంలో ఇర్ఫాన్ భార్య సుతప సిక్దర్ గుండె ధైర్యాన్ని చూసి అబ్బురపడని వాళ్లు ఉండరు. సుతపకు డైలాగ్ రైటర్‌గా, నిర్మాతగా సినీ పరిశ్రమతో అనుబంధం ఉంది. వాళ్లిద్దరూ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో క్లాస్‌మేట్స్. 1995లో ఇర్ఫాన్, సుతప వివాహం చేసుకున్నారు. తాజాగా ఆమె ఇర్ఫాన్ లేని జీవితంపై మొదటిసారిగా సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టారు. భర్తతో కలిసి ఉన్న ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.
`నేనేం కోల్పోలేదు.. అన్ని విధాలుగా ఆయన నాతోనే ఉన్నారు` అంటూ కామెంట్ చేశారు. భౌతికంగా దూరమయ్యారే తప్ప మానసికంగా ఇర్ఫాన్ తనతోనే ఉన్నారనే లోతైన అర్థాన్ని ధ్వనించే ఆమె పోస్ట్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. తన భర్తకు మరణం లేదనే భావన ఆమెలో గాఢంగా ఉందనేందుకు ఈ పోస్టే నిదర్శనం. అంతేకాదు దుఃఖ కాలంలో మనో నిబ్బరంతో షేర్ చేసిన ఆ పోస్ట్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.