ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు న్యాయస్థానాల్లో వరుస పెట్టి ఎదురుదెబ్బలు తుగులుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను తొలగిస్తూ జగన్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకోవటం రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇదే సమయంలో నిమ్మగడ్డ కులం మీద జగన్ స్వయంగా చేసిన వ్యాఖ్యలు కూడా కలకలం రేపాయి. ఒక ఉన్నతాధికారి మీద అధికారపక్షం స్పందించిన తీరు చూసి ముక్కున వేలేసుకున్నోళ్లు చాలామందే ఉన్నారు.
తాను అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిపోవటం కోసం దేనికైనా రెఢీ అన్నట్లు వ్యవహరించే జగన్.. ఆ వాదనను నిజం చేస్తూ.. నిమ్మగడ్డ విషయంలో వ్యవహరించిన వైనంపై రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమైంది. ప్రపంచమంతా మాయదారి రోగాన్ని నిలువరించే విషయం మీద ఫోకస్ పెడితే.. ఏపీ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా రమేశ్ కుమార్ ను ఇంటికి పంపించే విషయంలో అనుసరించే విధానం సరికాదన్న మాట వినిపించింది.
ఈ వాదనలకు బలం చేకూరేలా ఏపీ హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు ఉందని చెప్పక తప్పదు. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ టైమ్లీగా ఒక ట్వీట్ పోస్టు చేశారు. రమేశ్ కుమార్ నియమకాన్ని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జనసేన తప్పు పడుతూ ఏప్రిల్ పదో తేదీన ఒక ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయమా? అని పేర్కొనటం గమనార్హం.
హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుపై స్పందించిన పవన్ కల్యాణ్.. ‘‘ఈ రోజు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సును రద్దు చేస్తూ.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసింది. అలాగే ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలకు విశ్వాసం ఇనుమడింపజేసింది’’ అంటూ చేసిన ట్వీట్ పంచ్ వేశారు. తన ట్వీట్ తో ఏపీ సర్కారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే.. దాని దూకుడుకు కళ్లాలు వేసే వ్యవస్థలు ఉన్నాయన్న విషయాన్ని పవన్ ట్వీట్ చెప్పిందని చెప్పక తప్పదు.