ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయమై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరుగుతున్న విషయం విదితమే. ‘ఏకైక రాజధాని అమరావతి ముద్దు.. మూడు రాజధానులు వద్దు..’ అంటూ కొందరు పిటిషన్లు దాఖలు చేశారు. ‘ఒక రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు’ అంటోంది వైఎస్ జగన్ సర్కార్. ఈ క్రమంలో ఇరు పక్షాల నుంచీ వాదనలు వాడి వేడిగా సాగుతున్నాయి.
తాజాగా నిన్నటి విచారణ సందర్భంగా, న్యాయస్థానంలో వైఎస్ జగన్ సర్కార్ తనదైన వాదనను మరింత బలంగా విన్పించింది. చంద్రబాబు హయాంలో వ్యాపారవేత్తలు కొందరు అమరావతిని రాజధానిగా నిర్ణయించారని జగన్ సర్కార్ తరఫున సీనియర్ న్యాయవాది కోర్టుకు నివేదించారు. అదే సమయంలో, రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదనీ జగన్ సర్కార్ స్పష్టం చేసింది. ఇక్కడే, జగన్ సర్కార్ బొక్కబోర్లా పడుతోంది.
వ్యాపారవేత్తలే అమరావతిని రాజధానిగా నిర్ణయించారని అనుకుందాం. అలాగైతే, అసెంబ్లీ సాక్షిగా అప్పటి ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అమరావతికి ఎందుకు మద్దతు పలికినట్లు.? ఈ క్రమంలో, సదరు వ్యాపారవేత్తలతో వైసీపీ కూడా అప్పట్లో లాలూచీ పడిందని ప్రస్తుత వైఎస్ జగన్ ప్రభుత్వం ఒప్పుకుంటున్నట్లేనా.! ఇది కాస్తా టీడీపీ, వైసీపీ మధ్య వున్న 60-40 ఒప్పందాన్ని చెప్పకనే చెప్పేసినట్లయ్యింది.
రాష్ట్ర రాజధాని అనే అంశం రాష్ట్రం పరిధిలోని అంశమే కావొచ్చు. ఆ లెక్కనే కదా, అమరావతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధానిగా ప్రకటించింది. ఇప్పుడు వైఎస్ జగన్ సర్కార్ మూడు రాజధానుల ఆవశ్యకత గురించి వివరిస్తోంది. ఆ మూడు రాజధానుల్లో అమరావతి కూడా ఒకటి. మళ్ళీ, ఇక్కడ ఇంకోసారి వైఎస్ జగన్ సర్కార్ బోల్తా కొట్టేసింది.
శివరామకృష్ణన్ కమిటీ నివేదికలో కృష్ణా – గుంటూరు జిల్లాల మధ్యలో రాజధాని క్షేమం కాదని పేర్కొన్నా, ఆ వాదనని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం, తన ఇష్టానికి అమరావతిని రాజధానిగా చేసిందని వైఎస్ జగన్ సర్కార్, కోర్టుకు నివేదించింది. అదే నిజమైతే, అమరావతిని శాసన రాజధానిగా ఎందుకు వైసీపీ కొనసాగించాలనుకుంటున్నట్లు.?
వైసీపీ ఏదైనా చెప్పొచ్చు.. టీడీపీ ఇంకేదైనా వాదించొచ్చు.. ఈ రాజకీయ గందరగోళం కారణంగా ప్రజలూ కొంత అయోమయానికి గురవ్వొచ్చు. కానీ, న్యాయస్థానాల ముందు అన్ని ‘పాయింట్లూ’ స్పష్టంగా నమోదవుతున్నాయి. ఈ గందరగోళమంతా వైఎస్ జగన్ సర్కార్‌లోనే వుందని.. వైసీపీ ప్రభుత్వం, న్యాయస్థానం ముందుంచుతున్న వాదనలతోనే నిరూపితమవుతోంది.