సంక్షేమ పథకాల కోసం దేవుడి సొమ్ముల్ని విచ్చలవిడిగా ఖర్చు చేసేస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం.. అంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదేంటీ, దేవాదాయ శాఖ.. అంటే ప్రభుత్వ పరిధిలోనిదే కదా.. ఆ సొమ్ముని, సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేస్తే తప్పేంటట.? అన్న డౌట్ మీకొస్తే అది మీ తప్పు కాదు. దేవాదాయ శాఖకు సంబంధించిన నిధులు.. అంటే, దేవాలయాల ద్వారా వచ్చే సొమ్ములే కదా.! మరి, ఆ సొమ్ముల్ని.. కుల మతాలకతీతంగా అందరికీ ఖర్చు చేసేస్తే ఎలా.?
హిందూ దేవాలయానికి చెందిన హుండీలో వేసే సొమ్ములు.. హిందూ భక్తులవే. ఆ లెక్కన, ఆ నిధులు హిందువులకే చెందాలన్నది ఓ లాజిక్. అసలు, దేవాలయాల్ని భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వాలకి దేవాలయాల ద్వారా వచ్చే సొమ్ముల్ని టచ్ చేసే అధికారమెక్కడిది.? అన్నది ఇంకో వాదన. ఎవరి గోల ఎలా వున్నాసరే, రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు కోసం వైఎస్ జగన్ సర్కార్ పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు.
ఎక్కడి నుంచి నిధులు లభించినా, ఎక్కడి నుంచి అప్పులు దొరికినా.. అస్సలు ఆలోచించడంలేదు. ‘మేం గొప్పగా పరిపాలించేస్తున్నాం.. మేం గొప్పగా సంక్షేమ పథకాల్ని అమలు చేసేస్తున్నాం..’ అంటూ అందినకాడికి అప్పులు, అందినకాడికి.. ఇతర శాఖల నుంచి సొమ్ముల్ని లాగేయడం వైసీపీ ప్రభుత్వానికే చెల్లిందన్నది విపక్షాల వాదన. దేవాదాయ శాఖ నుంచి సుమారు 47.63 కోట్ల రూపాయల నిధుల్ని జగనన్న దీవెన, వైఎస్సార్ ఆసరా, అమ్మ ఒడి తదితర పథకాల కోసం మళ్ళించడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.
దేవాలయాల భూముల్లో పేదలకు ఇళ్ళ స్థలాలు.. దేవాలయాల పేరుతో అడ్డగోలు రాజకీయం.. దేవాలయాల ఆస్తుల అమ్మకాలు.. ఇవన్నీ చాలక దేవాలయాలపై దాడులు.. ఇలా ఒకటేమిటి.? వైఎస్ జగన్ హయాంలో హిందూ మతానికి జరుగుతున్న అన్యాయాలు అన్నీ ఇన్నీ కావంటూ హిందూ సంఘాలు మండిపడుతున్న వేళ, దేవాదాయ శాఖకు చెందిన నిధుల్ని, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సంక్షేమ పథకాలకు ఖర్చు చేయడం మరింత వివాదాస్పదమవుతోంది.
రాష్ట్రంలో ఏ చర్చికీ టిక్కెట్ లేదు.. ఏ మసీదులోనూ ప్రత్యేక ప్రార్థనల కోసం టిక్కెట్లు లేవు.. కానీ, హిందూ దేవాలయాల్లోనే అన్నిటికీ టిక్కెట్లు. పైగా, అలా వచ్చిన సొమ్ములతో.. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు.. అందరికీ చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? హిందూ సమాజం కాస్త లోతుగా ఆలోచించాల్సిన సమస్య ఇది.