సహజంగా న్యాయస్థానాలంటే ఎవరైనా ఎందుకులేబ్బా అనుకుంటారు. కోర్టు తీర్పులు, ఆదేశాలు, సూచనలు ఇష్టం లేక పోయినా…పైకి మాత్రం ఆ మాట చెప్పడానికి ధైర్యం చేయరు. ఎందుకంటే సమీప భవిష్యత్‌లో న్యాయస్థానాల నుంచి మరో రూపంలో ఇబ్బందులు ఎదురు కాకుండా లౌక్యంగా వ్యవహరిస్తుంటారు. ప్రజాకోర్టులో అద్వితీయ విజయాన్ని దక్కించుకుని పాలనా పగ్గాలు చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు అడుగడుగునా చిక్కులు తప్పడం లేదు. జగన్‌కు అనేక వైపుల నుంచి, వివిధ రూపాల్లో అడ్డంకులు సృష్టించే శక్తులు కొన్ని తయారయ్యాయి.
కొన్ని పరిణామాల నేపథ్యంలో అసలు వైఎస్ జగన్ సర్కార్‌కు ప్రధాన ప్రతిపక్షం ఏపీ హైకోర్టు అనే స్థాయిలో సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నదంటే…పరిస్థితులు ఎక్కడికి దారి తీశాయో అర్థం చేసుకోవచ్చు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో 40 వేల మంది గూడు లేని వాళ్లకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటే…పట్టాలు ఇవ్వకుండా ఆదేశాలివ్వా లంటూ అదే జిల్లాకు చెందిన అడపా శ్రీనివాసరావు హైకోర్టులో పిల్ వేశారు.
దీనిపై అదనపు ఏజీ సుధాకర్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున వినిపించిన వాదనలు …”వామ్మో ఏపీ సర్కార్‌కు ఎంత ధైర్యం” అనేలా ఉన్నాయి. ప్రభుత్వ వెన్నుదన్ను లేకపోతే అదనపు ఏజీ సుధాకర్‌రెడ్డి సాక్ష్యాత్తు హైకోర్టులో ఆ స్థాయిలో హిత వచనాలు పలికే వారు కాదేమో అనిపిస్తుంది. తినబోతూ రుచి చూడటం ఎందుకూ…సుధాకర్‌రెడ్డి వాదనలో ముఖ్య అంశాలేంటో తెలుసుకుందాం.
“ప్రభుత్వాలు తీసుకునే పాలనాపరమైన నిర్ణయాల్లో న్యాయస్థానాలు ఓ స్థాయికి మించి జోక్యం చేసుకోడానికి వీల్లేదు. ఏపీలో సంక్షేమ కార్యక్రమాలు యజ్ఞంలా సాగుతున్నాయి. ఈ యజ్ఞానికి ఆటంకం కలిగించేందుకు కొందరు ప్రజాప్రయోజన వ్యాజ్యం పేరుతో అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఇలాంటి వారి విషయంలో హైకోర్టులు జాగరూకతతో ఉండాలి. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం పలుమార్లు స్పష్టం చేసింది. అల్లకల్లోలంగా ఉండే ఆఫ్రికాలో సైతం న్యాయస్థానాలు ఓ పరిధి మేరకే జోక్యం చేసుకుంటాయి.
రేపు బడ్జెట్‌లో సంక్షేమ కేటాయింపులను సైతం ప్రశ్నిస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించే రోజు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసే వ్యక్తుల ఉద్దేశాలు, ప్రయోజనాలు , వారి వెనుక ఉన్న వ్యక్తుల గురించి న్యాయస్థానాలు లోతుగా విచారించాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాతే ప్రభుత్వ నిర్ణయంలో తప్పొప్పులు చూడాలి…” ఇలా ఏపీ ప్రభుత్వ అదనపు ఏజీ సుధాకర్‌రెడ్డి బలమైన వాదనలు వినిపించారు.
ఈయన వాదనలను లోతుగా పరిశీలిస్తే …గత కొంత కాలంగా ఏపీ సర్కార్‌పై దాఖలు చేస్తున్న పిల్‌లు, వాటిపై హైకోర్టులో వెలువడుతున్న తీర్పులు, ఆదేశాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ పాలనాపరమైన అంశాల్లో కోర్టులు తమ పరిధులను అతిక్రమించొద్దనే సున్నితమైన హితవు పలికారు.
దేశంలో ఎన్ని కోర్టులున్నా…రాజకీయ నేతల భవితవ్యాన్ని అంతిమంగా తేల్చేది మాత్రం ప్రజాకోర్టే. ఐదేళ్లకో సారి ఇచ్చే తీర్పు రాజకీయ నాయకులు తలరాతలను మార్చుతుంది. తాము ప్రజల కంటే అతీతులమని ఎవరైనా విర్రవీగి ప్రవర్తిస్తే, పాలన సాగిస్తే…చంద్రబాబుకు ఏ గతి పట్టిందో అందరికీ తెలిసిందే. ప్రజాకోర్టు విధించే శిక్ష ఎంత క్రూరంగా ఉంటుందో చంద్రబాబును, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని అడిగితే కథలు కథలుగా చెప్పే అవకాశం ఉంది.
అలాంటప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా పది కాలాల పాటు అధికారంలో కొనసాగాలనుకుంటే ప్రజల మన్ననలు పొందే నిర్ణయాలు తీసుకుంటుంది, తీసుకోవాలి కూడా. అందువల్ల కొన్ని పాలనాపరమైన అంశాల్లో నిర్ణయాన్ని, తీర్పును ప్రజాకోర్టుకు వదిలేయడం శ్రేయస్కరం. ఎందుకంటే మనది ప్రజాస్వామ్య దేశం. ఈ వ్యవస్థలో అన్నిఅన్ని రాజ్యాంగ సంస్థలు పరస్పరం గౌరవించుకోవాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పది కాలాల పాటు వర్ధిల్లుతుంది.