తెలంగాణ రాజకీయ యవనికపైకి జనసేన అడుగు పెట్టబోతోంది. పార్టీ ఆవిర్భావం తర్వాత ఏపీ రాజకీయాలపైనే ప్రధానంగా దృష్టి సారించిన జనసేన.. వీలును బట్టి తెలంగాణలోనూ పోటీ చేస్తామని అప్పట్లో ప్రకటించింది. గత ఎన్నికల్లో నేరుగా పోటీ చేయకుండా మాయావతి నేతృత్వంలోని బహుజన సమాజ్ పార్టీకి మద్దతిచ్చింది. తాజాగా తెలంగాణలో ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకుంది.
త్వరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలను ఇందుకు వేదిక కానున్నాయి. భారతీయ జనతాపార్టీతో జతకట్టి ఈ ఎన్నికల బరిలోకి దిగడానిక జనసేన సమాయత్తమవుతోంది. దీనికి సంబంధించి రెండు పార్టీల మధ్య చర్చలు దాదాపుగా పూర్తయినట్టు సమాచారం. ఇప్పటికే ఏపీలో కలిసి సాగుతున్న ఈ రెండు పార్టీలు.. తెలంగాణలోనూ కలసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి.
ఇందులో భాగంగా తొలుత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. బీజేపీకి గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో కాస్త పట్టుంది. అదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు యువతలో మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో కలిసి పోటీ చేస్తే తప్పకుండా లాభం కలుగుతుందని ఆ పార్టీలు భావిస్తున్నాయి.
ఈ విషయంలో పవన్ కల్యాణ్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మధ్య చర్చలు కూడా జరిగినట్టు సమాచారం. పది శాతం సీట్లను జనసేనకు ఇచ్చేలా ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది. మొత్తమ్మీద 15 సీట్ల వరకు జనసేనకు కేటాయించేందుకు బీజేపీ అంగీకరించినట్టు సమాచారం.
సీట్ల విషయంపై రెండు పార్టీల మధ్య ఇంకా పూర్తిస్థాయి అంగీకారం కుదరకపోయినా.. పొత్తు మాత్రం ఖాయమని కాషాయ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ జనసేన మద్దతు తీసుకోవాలని కమలం పార్టీ యోచిస్తోందని సమాచారం.