Advertisement

జస్ట్‌ ఆస్కింగ్‌: సజావుగా ఎన్నికల నిర్వహణ అంటే ఏమిటో.!

Posted : April 19, 2020 at 4:47 pm IST by ManaTeluguMovies

స్థానిక ఎన్నికల నిర్వహణ ఎలా వుంటుంది.? అని చిన్న పిల్లాడిని అడిగినా చెప్పేస్తాడు.. అధికార పార్టీ చేతిలో అధికారులు కీలు బొమ్మల్లా మారతారనీ.. ప్రత్యర్థులు పోటీ చేసే పరిస్థితులు వుండవనీ.. నామినేషన్‌ పత్రాలు చిరిగిపోతాయనీ..! ‘చంద్రబాబు హయాంలో అలా జరిగింది.. మా హయాంలో ఇలా జరిగితే తప్పేంటి.?’ అంటూ ‘అరాచకం’పై బుకాయించడం వైసీపీ నేతలకు అన్ని విషయాల్లోనూ అలవాటైపోయింది.. ఆ అలవాటులో పొరపాటుగానే, అధికార పార్టీ నేతలు.. స్థానిక ఎన్నికల వేళ తమ సత్తా చాటారు.

ఆఖరికి మహిళలనీ చూడకుండా, విపక్షాలకు చెందిన అభ్యర్థులతో అసభ్యకరంగా వ్యవహంచిన ఘటనల్ని చూశాం. ‘పోలీసులు ఎక్కడ.?’ అన్న ప్రశ్నకి, ‘ఇదిగో ఇక్కడ..’ అనే సమాధానం కన్పిస్తున్నా, చేష్టలుడిగిన వైనం.. అన్ని న్యూస్‌ ఛానళ్ళలోనూ దర్శనమిచ్చింది. ఫ్యాక్షన్‌ అంటే ఏంటో అప్పటిదాకా తెలియని ప్రాంతాల్లో కూడా, ప్రత్యర్థుల్ని అధికార పార్టీ నేతలు మారణాయుధాలతో వెంటతరిమిన వైనాన్ని తిలకించాం కదా.! ఆయా ఘటనలపై ఫిర్యాదులొస్తే, చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఆదేశాలు జారీ చేసినందుకు, నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై వైఎస్‌ జగన్‌ సర్కార్‌ వేటు వేసింది.

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని కమ్మేస్తోంది.. ఈ తరుణంలో ఎన్నికలు సబబు కాదు.. అని అదే ఎన్నికల కమిషనర్‌ ఎన్నికల ప్రక్రియని వాయిదా వేస్తే.. ఆయన మీద కులం ముద్ర వేసింది వైఎస్‌ జగన్‌ సర్కార్‌. ఇప్పుడు ఈ వ్యవహారం హైకోర్టు మెట్లెక్కింది. కోర్టులో ప్రభుత్వం తన వాదనను విన్పించబోతోంది. దీనికి సంబంధించి ఓ అఫిడవిట్‌ని కూడా దాఖలు చేసింది ప్రభుత్వం. అందులో, ‘ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకోసం..’ అంటూ ప్రస్తావించింది. ఇక్కడ ‘సజావుగా’ అంటే ఏంటి.? నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌, అధికార పార్టీ అరాచకాల్ని ప్రశ్నించడం పెద్ద నేరం. ఆ నేరానికి పాల్పడినందుకు నిమ్మగడ్డపై వేటు వేయడం సమంజసం.

కోర్టు ఏం తీర్పు ఇస్తుంది.? అన్నది వేరే చర్చ. ఎన్నికల కమిషనర్‌పై ఓ ముఖ్యమంత్రి ‘కులం ముద్ర’ వేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో జనానికి అర్థమయ్యింది. వైసీపీ దృష్టిలో ‘సజావుగా’ ఎన్నికలు జరగడమంటే ఏంటో కూడా అర్థమయిపోయింది. ముంచుకొస్తున్న కరోనా మీద పారాసిటమాల్‌, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లేసి, ఎన్నికలు నిర్వహించేయాలన్న ప్రభుత్వ ఆదుర్ధా ఏంటో తెలిసిపోయింది. ఒకవేళ ఎన్నికలు జరిగి వుంటే.? రాష్ట్రంలో కరోనా సృష్టించే విధ్వంసం ఎలా వుండేదో ఊహించుకోలేం.!


Advertisement

Recent Random Post:

సినీ నటుడు అలీకి నోటీసులు | Comedian Ali Gets Notices For Illegal Constructions

Posted : November 24, 2024 at 7:29 pm IST by ManaTeluguMovies

సినీ నటుడు అలీకి నోటీసులు | Comedian Ali Gets Notices For Illegal Constructions

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad