ప్రస్తుతం లాక్ డౌన్ 4.0 కొనసాగుతోంది. గత 60 రోజుల నుండి భారతదేశం లాక్ డౌన్ లో ఉండగా ఇప్పుడిప్పుడే ప్రభుత్వం కొన్ని అనుమతులను మంజూరు చేసింది. అయితే సినిమా షూటింగ్ లకు మాత్రం ఎలాంటి ఊరట లభించలేదు. దాదాపు రెండు నెలల నుండి సినిమా షూటింగ్ లు లేక సినిమా వాళ్ళు అందరూ ఇంటి పట్టునే ఉంటున్నారు.
కొంత మంది సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటే మరికొంత మంది పూర్తిగా కుటుంబానికే తమ సమయాన్ని కేటాయిస్తున్నారు. షూటింగ్ లు లేకపోవడంతో చిన్న ఆర్టిస్ట్ నుండి పెద్ద సూపర్ స్టార్ వరకూ ఎవరికీ ఈ రెండున్నర నెలల్లో ఎలాంటి ఆదాయం లేదు. ఇద్దరు ముద్దు గుమ్మలకు తప్ప.
వారే కాజల్ అగర్వాల్, మిల్కీ బ్యూటీ తమన్నా. ఇద్దరూ కూడా వేర్వేరు బ్రాండ్స్ ను ఈ లాక్ డౌన్ లో ప్రమోట్ చేస్తూ ఆదాయాన్ని గడిస్తున్నారు. కాజల్ అగర్వాల్ భారత్ బిల్ పే.. పేమెంట్ యాప్ ను ప్రమోట్ చేస్తుండగా, తమన్నా ఎంపీఎల్ గేమ్స్ అనే గేమింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తోంది. రోజంతా ఈ యాప్ తోనే తన సమయం గడుస్తోందని చెప్పి అందరినీ ఆకర్షిస్తోంది తమన్నా.
వీరిద్దరూ ఇండస్ట్రీకి వచ్చి ఎప్పుడో దశాబ్దం దాటేసింది. అయినా కూడా ఇంకా ఈ ఇద్దరూ తమ క్రేజ్ ను అలాగే కాపాడుకుంటూ వస్తున్నారు. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా ఇద్దరికీ అవకాశాలకు కొదవలేకుండా సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.