తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగిసింది. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు నటుడు కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యంలో రాజీనామాల పరంపర కొనసాగుతోంది. తాజా ఎన్నికల్లో పార్టీ ఘోర పరాభవం నేపథ్యంలో ఇప్పటికే పలువురు పార్టీని వీడగా.. తాజాగా పార్టీ ఉపాధ్యక్షుడు మహేంద్రన్ సైతం రాజీనామా చేశారు. పైగా రాజీనామా లేఖలో పలు ఆరోపణలు కూడా చేశారు. పార్టీలో కమల్ ను కొందరు పక్కదారి పట్టిస్తున్నారని.. కమల్ పార్టీ నడిపే తీరు కూడా ప్రజాస్వామ్యంగా లేదని విమర్శించారు.
పార్టీలో విభజించు-పాలించు విధానం అమల్లో ఉందని దుయ్యబట్టారు. దీనిపై కమల్ హాసన్ తీవ్రంగా స్పందించారు. ఆయన్ను ద్రోహి అంటూ మండిపడ్డారు. మహేంద్రన్ రాజీనామా చేయకపోయినా.. పార్టీ నుంచి తామే తొలగించేవారమని పేర్కొన్నారు. పార్టీ నుంచి ఓ కలుపు మొక్క బయటకు వెళ్లిందని.. ఇందుకు తామంతా సంతోషంగా ఉన్నామని వ్యాఖ్యానించారు. పిరికిపందల్లా పార్టీ వీడేవారి గురించి ఆలోచించేది లేదన్నారు. కొంతమంది రాజీనామా వల్ల పార్టీ లక్ష్యం మాత్రం మారదని స్పష్టంచేశారు.