ఇంత కాలం తమను బీజేపీ రాష్ట్ర నేతలు ఏమన్నా…అధికార వైసీపీ నేతలు పట్టించుకోలేదు. పోనీలే అనే అధికార వైసీపీ ఉదాసీనతను బీజేపీ వాళ్లు అసమర్థతగా తీసుకుని రెచ్చిపోతూ మాట్లాడుతున్నారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అయితే టీడీపీ అధినేత చంద్రబాబుకు అధికార ప్రతినిధి పాత్ర పోషిస్తున్నాడు. ఎల్లో మీడియాకు కన్నా లక్ష్మినారాయణ ఆస్థాన విద్వాంసుడయ్యాడు.
అయితే సహనానికి కూడా ఓ హద్దు ఉంటుందంటారు. వైసీపీపై విమర్శలు గుప్పించడంలో ఏపీ బీజేపీ నేతలు హద్దులు దాటారు. దీంతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అదును చూసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నానే చావు దెబ్బతీశాడు. చంద్రబాబు నుంచి రూ.20 కోట్ల ముడుపులు ముట్టడం వల్లే కన్నా తమను విమర్శిస్తున్నారని ఘాటుగా ఆరోపించాడు. దీంతో కన్నాకు దిక్కుతోచలేదు.
ఈ నేపథ్యంలో సోమవారం కన్నా లక్ష్మినారాయణ మీడియా ముందుకొచ్చి విజయసాయిరెడ్డి ఆరోపణలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. విలేకరుల సమావేశంలో కన్నా మాటలు వింటుంటే…తన గురించి చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారని అర్థమవుతుంది. తనపై విమర్శలంటే ఆకాశంపై ఉమ్మేసినట్లేనని కన్నా అన్నాడు. అంటే తనను ఆకాశమంత ఉన్నతమైన వ్యక్తిగా కన్నా ఊహించుకుంటున్నారన్న మాట.
కనీసం తన గురించి తెలిసిన వాళ్లెవరైనా ఏమన్నా అనుకుంటారనే కనీస స్పృహ కూడా కన్నా కోల్పోయాడని ఆయన మాట్లాడిన తీరును బట్టి అర్థమవుతోంది. విజయసాయిరెడ్డి ఇష్టానుసారం మాట్లాడితే పరువు నష్టం దావా వేస్తానని ఆయన హెచ్చరించాడు. తెల్లారితే వైసీపీలోకి మారేందుకు సిద్ధమై, బీజేపీ ఢిల్లీ నేతలు రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశ చూపితే…పార్టీ మారే ఆలోచన విరమించుకున్న కన్నాకు కూడా పరువట! దానికి మళ్లీ పోవడమట! అదేంటో తనకు మల్లే ఇతరులకు కూడా పరువు ఉంటుందని, జాగ్రత్తగా మాట్లాడాలనే స్పృహ కన్నాకు ఎందుకు లేదో?
ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేసి పారదర్శకత నిరూపించుకోవాలని ఉచిత సలహాలిస్తున్న కన్నా లక్ష్మినారాయణ…తనపై విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణల్లో నిజం లేదని ఎందుకు నిరూపించుకోవాలనుకోవడం లేదో మరి?
‘నన్ను కొనే దమ్ము ఈ భూమి మీద ఎవడికీ లేదు. నీకు దమ్ముంటే.. మగాడివైతే కాణిపాకంలో ప్రమాణం చేస్తావా?. విజయసాయిరెడ్డి అధికారమదం తలకెక్కి మాట్లాడుతున్నారు. విజయసాయిరెడ్డి పిచ్చి మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదు. విజయసాయిరెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మీరు ప్రజాధనాన్ని దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోవాలా?. నిజాయితీ నిరూపించుకోమని అడగడం దుష్ప్రచారం ఎలా అవుతుంది?’ అని కన్నా ప్రశ్నల వర్షం కురిపించాడు.
బాగానే ఉంది. రూ.20 కోట్ల ముడుపుల ఆరోపణల సెగ కన్నాకు బాగా మంట పుట్టించినట్టే ఉంది. మగాడివైతే కాణిపాకంలో ప్రమాణం చేస్తావా అని విజయసాయిని ప్రశ్నిస్తున్న కన్నా…ప్రభుత్వంపై తాను చేస్తున్న అవినీతి ఆరోపణలకు సంబంధించి కూడా అదే పని కాణిపాకంలో చేసే దమ్ము, ధైర్యం ఉన్నాయా? ఏం తననంటే అంతగా శివాలెత్తుతున్న కన్నా…ఇతరులపై వేలెత్తి చూపేటప్పుడు మిగిలిన నాలుగు వేళ్లు తనవైపే ఉన్నాయనే కనీస ఇంగిత జ్ఞానం లేదా? కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందనే అహంకారంతోనే కదా తమరు నోటికొచ్చినట్టు ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేస్తుండటం నిజం కాదా?
విజయసాయిరెడ్డి ఆరోపణలు చేస్తే మాత్రం మర్యాద ఉండదని హెచ్చరిస్తున్నారే….మన పట్ల ఇతరులు ఎలా ఉండాలని కోరుకుంటామో, ఇతరుల పట్ల మనం కూడా అట్లే ఉండాలనే సంస్కారం ఉండి ఉంటే… విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసే పరిస్థితి వచ్చి ఉండేదా? కరోనా టెస్టింగ్ కిట్ల కొనుగోలులో ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తి పడిందని ఆరోపించడం దుష్ప్రచారం కాకపోతే… విజయసాయిరెడ్డి ఆరోపణలు కూడా పరువు తీసేవి ఎలా అవుతాయో కన్నా లక్ష్మినారాయణ జవాబు చెప్పాల్సిందే. ప్రజల తిరస్కరణకు గురైన కన్నా లక్ష్మినారాయణ…తానొక ఔట్ డేటెడ్ పొలిటీషియన్ అనే వాస్తవాన్ని ఇప్పటికైనా గుర్తిస్తే…స్థాయికి మించి మాట్లాడే అవకాశం రాదు.