తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల పునరుద్ధరణ జరగడంలేదు. లాక్‌డౌన్ నిబంధనల్ని సడలిస్తూ, అన్‌లాక్ మార్గదర్శకాలు ఎప్పుడో జారీ అయ్యాయి అంతర్రాష్ట రవాణాకి సంబంధించి. కానీ, ఇప్పటిదాకా.. ఇట్నుంచి అటు.. అట్నుంచి ఇటు ఆర్టీసీ బస్సులు తిరగడంలేదాయె. ప్రైవేటు బస్సులు మాత్రం ‘పొలో’మని తిరిగేస్తున్నాయి.. ప్రయాణీకుల్ని దోచేస్తున్నాయి. ప్రైవేటు బస్సులే కాదు, కార్లు తదితర చిన్న వాహనాలు కూడా ప్రయాణీకుల్ని అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటూ తిప్పేస్తూ ‘పండగ’ చేసుకుంటున్నాయి.
దసరా సీజన్.. రెండు రాష్ట్రాలకూ ఎంతో ప్రత్యేకం. సంక్రాంతి కంటే కూడా పెద్ద సీజన్ ఇది. ఈ సీజన్‌లో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెద్దయెత్తున ఆర్టీసీ బస్సులు తిరిగేవి గతంలో. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పటికే చాలా నష్టం జరిగింది రెండు రాష్ట్రాల్లోని ఆర్టీసీకి. ‘ప్రైవేటు బస్సుల్ని నియంత్రిస్తాం.. ఆర్టీసీని ఉద్ధరిస్తాం..’ అంటూ గతంలో ఇటు టీఆర్‌ఎస్ ప్రభుత్వం, అటు వైఎస్ జగన్ ప్రభుత్వం చెప్పాయి. కానీ, జరుగుతున్నదేంటి.?
ప్రైవేటు బస్సులకు ఇబ్బందుల్లేవ్.. ఆర్టీసీ బస్సులు మాత్రం ఇబ్బంది పడుతున్నాయి. అధికారుల స్థాయిలో చర్చలు జరుగుతూనే వున్నాయిగానీ.. సమస్యకు పరిష్కారం దొరకడంలేదు. గ్రేటర్ హైద్రాబాద్ వరదల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ సాయం కోరింది. ఆంధ్రప్రదేశ్ కొన్ని బోట్లను తెలంగాణకు పంపించింది హుటాహుటిన. అంటే, ఇరు రాష్ట్రాల మధ్య సఖ్యత వున్నట్లే. మరి, ఆర్టీసీ బస్సులెందుకు ఇరు రాష్ట్రాల మధ్యా తిరగడంలేదు.? అంటే, తెరవెనుక ఏదో రాజకీయం గట్టిగా నడుస్తోందన్నమాట.
ప్రైవేటు బస్సు ఆపరేటర్లను ఉద్ధరించే కార్యక్రమం ఇరు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలూ చేస్తున్నాయని అర్థం చేసుకోవాలేమో. ఇద్దరూ ఓ మెట్టు దిగి, ఆర్టీసీని ఉద్ధరించాలిగానీ.. మొండికేసి.. ఆర్టీసీని ముంచేయడమేంటి.? ‘మేం వెనక్కి తగ్గుతున్నాం.. కానీ, తెలంగాణ ఒప్పుకోవడంలేదు..’ అని ఆంధ్రప్రదేశ్ అంటోంది. ఆంధ్రప్రదేశ్ గొంతెమ్మకోర్కెలు తీర్చలేం.. అని తెలంగాణ అంటోంది. ఎవరి కోరికలేంటోగానీ, మధ్యలో ప్రయాణీకులు దోపిడీకి గురవుతున్నారు. అంటే, ఇరు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలూ ప్రజలు దోపిడీకి గురవుతోంటే పైశాచిక ఆనందం పొందుతున్నాయని అనుకోవచ్చా.?