ప్రతి ఏటా నవంబర్ 29వ తేదీని తెలంగాణలో దీక్షా దివస్ గా జరుపుకుంటున్నారు. 11 ఏళ్ల క్రితం తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన నాటి కేసీఆర్ దీక్ష మొదలైంది ఆరోజునే. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఉమ్మడి ఏపీ సమయంలో ఎంతగా పోరాడారో తెలిసిన విషయమే. 13ఏళ్ల సుదీర్ఘ పోరాటం అనంతరం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యింది. అయితే.. సుదీర్ఘమైన ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో 2009 నవంబర్ 29కు ప్రత్యేక స్థానం ఉంది.
కేసీఆర్ చేపట్టిన దీక్ష ఆ సమయంలో కీలకపాత్ర పోషించింది. ‘కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అనే నినాదంతో ఆయన చేసిన నిరాహార దీక్షకు జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చింది. తెలంగాణ ఉద్యమం మహోగ్రరూపం దాల్చింది. అనేక పరిస్థితుల అనంతరం ఐదేళ్లకు తెలంగాణ ఏర్పాటయ్యింది. అప్పటినుంచీ ప్రతిఏటా నవంబర్ 29వ తేదీని దీక్షా దివస్ గా జరుపుకుంటున్నారు.
దీంతో ఆరోజు మంత్రి కేటీఆర్ ఆ సందర్భాన్ని, పోరాటాన్ని, ఉద్యమాన్ని గుర్తు చేసుకున్నారు. ట్విట్టర్ ద్వారా ప్రజలకు దీక్షా దివస్ శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ ఉద్యమం మలుపు తిరిగిన రోజు అది. తెలంగాణ ప్రజలను ఒక్క తాటిపైకి తీసుకొచ్చిన రోజు.. దీక్ష’ అంటూ ఆనాటి జ్ఞాపకాలను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. అప్పటి కేసీఆర్ దీక్ష ఫొటోలను కూడా పోస్ట్ చేశారు.