తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) ఈ మధ్య పదే పదే హెలికాప్టర్ గురించి మాట్లాడుతున్నారు. నిజానికి ఆయన మాట్లాడుతున్నది హెలికాప్టర్ మనీ గురించి. ఆర్థిక విపత్తుల నేపథ్యంలో ఈ హెలికాప్టర్ మనీ అనే అంశం చర్చకు వస్తుంది. దేశంలో కరోనా మహమ్మారితోపాటు, ఆర్థిక విపత్తు కూడా విజృంభిస్తోంది.
లాక్‌డౌన్ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ పరిస్థితుల్లో హెలికాప్టర్ మనీ ఒక్కటే బెస్ట్ ఆప్షన్ అన్నది కేసీఆర్ మాట. అయితే, కేసీఆర్ ఆలోచనని కేంద్రం ఇప్పటికే పలుమార్లు తిరస్కరించింది. ‘హెలికాప్టర్ మనీ కాకపోతే ఏరోప్లేన్ మనీ అనే పేరు పెట్టండి.. కానీ, ఆ హెలికాప్టర్ మనీలోని అసలు విషయాన్ని గ్రహించండి.. రాష్ట్రాల్ని ఆదుకోండి..’ అంటూ కేసీఆర్ పదే పదే కేంద్రానికి మొరపెట్టుకుంటున్నారు.
ఇదిలా వుంటే, మరోమారు కేసీఆర్, హెలికాప్టర్ మనీ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్ళబోతున్నారట ప్రధాని నిర్వహించబోయే టెలికాన్ఫరెన్స్ సందర్భంగా. ‘రాష్ట్రాలకు ఆర్థిక వెసులుబాట్లు తప్పనిసరి. రాష్ట్రాలు బావుంటేనే, కేంద్రం బావుంటుంది..’ అంటూ మొన్నీమధ్యనే ప్రెస్‌మీట్ సందర్భంగా కేసీఆర్, తన అభిప్రాయాన్ని కుండబద్దలుగొడుతూ, కేంద్రానికి విషయం చేరేలా మాట్లాడారు. అయినాగానీ, కేంద్రం నుంచి సానుకూలమైన రెస్పాన్స్ రాలేదు.
అయితే, మారిన పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం, రాష్ట్రాల్ని ఆదుకునేందుకు ‘భారీ ఆర్థిక ప్యాకేజీ’ ప్రకటించక తప్పని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రాలు అదనంగా అప్పులు చేసుకునే అవకాశాల్ని కల్పించడమే కాదు, కేంద్రం కూడా తనవంతు సాయం చేయాల్సి వుంది రాష్ట్రాలకి. ఈ రెండూ జరగకపోతే, కరోనా వైరస్ మాటేమోగానీ, ఆర్థిక విపత్తుతో ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుందన్నది నిర్వివాదాంశం.