నిజామాబాద్ టీఆర్ఎస్ నేత సీనియర్ హీరోయిన్ కీర్తి రెడ్డి తండ్రి కేశ్ పల్లి(గడ్డం) ఆనంద్ రెడ్డి(60) ఈరోజు శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో గుండెపోటు రావడంతో ఆనంద్ రెడ్డిని కుటుంబసభ్యులు హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే కొద్ది గంటల్లోనే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ఆనంద్ రెడ్డి సీనియర్ నాయకులు మాజీ ఎంపీ కేశ్ పల్లి గంగారెడ్డి కుమారుడు. తన తండ్రి ఎంపీగా ఉన్నప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ప్రారంభంలో ఆనంద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షుడిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో బిజెపి పార్టీ తరపున నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈరోజు నిజామాబాద్ లో ఆనంద్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కేశ్ పల్లి ఆనంద్ రెడ్డి మృతి పట్ల టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు సంతాపం ప్రకటించారు. ఆనంద్ రెడ్డి ఇద్దరు కుమార్తెలలో హీరోయిన్ కీర్తి రెడ్డి ఒకరు. ‘తొలిప్రేమ’ ‘యువకుడు’ ‘రావోయి చందమామ’ వంటి సినిమాల్లో నటించిన కీర్తి.. 2004లో హీరో సుమంత్ ను వివాహం చేసుకుని 2006 లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కీర్తి మరో వ్యక్తిని వివాహం చేసుకున్నారు.