తమిళ రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. ఇందులో భాగంగా కమల్‌హాసన్ ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. ఈమేరకు గురువారం ఉదయం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో పోన్‌లో మాట్లాడారు. కేజ్రీవాల్ ఇందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో చెన్నైలోని మక్కల్ నీదిమయ్యం పార్టీ కార్యాలయంలో ఆమ్ ఆద్మీ రాష్ట్ర శాఖ నాయకులు కమల్‌హాసన్‌తో భేటీ అయ్యారు. తమిళనాడులో వేళ్లూనుకున్న రెండు ద్రావిడ పార్టీలరహితంగా తృతీయ కూటమిని రూపొందించే ప్రయత్నాలు ప్రారంభించినట్టైంది.
కాగా.. రెండు నెలల ముందే కమల్‌హాసన్ డీఎంకే కూటమిలో వున్న కాంగ్రెస్, సీపీఐ. సీపీఎం పార్టీలను తన తృతీయ కూటమిలో చేర్చే ప్రయత్నాలు చేపట్టారు. అయితే..టీఎన్‌సీసీ అధ్యక్షుడు అళగిరి మక్కల్ నీదిమయ్యం పార్టీని కాంగ్రెస్ కూటమిలోకి రావాలని కోరగా కమల్ అంగీకరించలేదు. దీంతో కమల్ పార్టీలో చేరేది లేదని.. డీఎంకే కూటమిలోనే కొనసాగుతామని కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నేతలు ప్రకటించారు. ఈనేపథ్యంలో ఢిల్లీ సీఎంతో కమల్ హాసన్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.