ఆంధ్రప్రదేశ్‌కి చెందిన బీజేపీ నేతలు నెత్తీనోరూ బాదుకుంటున్నారు గడచిన ఏడాది కాలంగా.. తమ రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని. సాక్షాత్తూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ, వైఎస్ జగన్ ప్రభుత్వ తీరుని ఎప్పటికప్పుడు దుయ్యబడుతూనే వున్నారు. కానీ, ‘ఢిల్లీ స్థాయి’ నేతలుగా చెలామణీ అవుతున్న జీవీఎల్ నరసింహారావు వంటి కొందరు ‘ప్రో వైసీపీ’ బీజేపీ నేతలు మాత్రం, ఏపీ బీజేపీ ఆలోచనలకు భిన్నంగా వ్యవహరిస్తూ.. అధికార వైఎస్సార్సీపీకి వత్తాసు పలుకుతున్న విషయం విదితమే.
ఇదిలా వుంటే, తాజాగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు రాజ్యం నడుస్తోంది..’ అంటూ కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా పెను దుమారం రేగింది. కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై ఎలా స్పందించాలో తెలియక వైసీపీ నేతలు మల్లగుల్లాలు పడుతుండడం గమనార్హం.
స్థానిక ఎన్నికల వేళ ఏం జరిగిందో చూశాం. పోలీసులు చోద్యం చూశారన్న విమర్శలు వెల్లువెత్తాయి. అధికార పార్టీ నేతల్ని ప్రశ్నిస్తే, అలా ప్రశ్నించినవారిపై కేసులు నమోదవుతున్నాయి. చిత్రంగా, విపక్షాలపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తున్న అధికార పార్టీ మద్దతుదారులపై ఎలాంటి చర్యలూ వుండడంలేదు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్న విమర్శల సంగతి సరే సరి. జనసేన పార్టీ మద్దతుదారుల్ని కావొచ్చు, బీజేపీ మద్దతుదారుల్ని కావొచ్చు.. అధికారపక్షం విడిచిపెట్టడంలేదు.
వైసీపీ నేతలు కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో నిబంధనల్ని పట్టించుకోకుండా రాజకీయ కార్యక్రమాలు చేపట్టినా పోలీసులు పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. కానీ, ఇతర పార్టీలకు చెందిన నేతల మీద మాత్రం అర్థం పర్థం లేని కేసులతో వేధిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సరే, రాజకీయాల్లో ఆరోపణలు – ప్రత్యారోపణలు సహజాతి సహజమనుకోండి.. అది వేరే విషయం. ఇక, ఇప్పుడు కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు, ముందు ముందు రాష్ట్రంలో ఎలాంటి సరికొత్త రాజకీయ రచ్చకు కారణమవుతాయి.? అన్నదే ఇప్పుడు ఆసక్తికరమైన అంశం.
కిషన్‌రెడ్డి వ్యాఖ్యల్లో ‘లోతైన అర్థం’ వుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ‘ఆయన సాదా సీదా బీజేపీ నాయకుడు కాదు. ఆయన కేంద్ర మంత్రి పదవిలో వున్నారు. పైగా, కీలకమైన హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన వ్యాఖ్యల వెనుక నిగూఢమైన అర్థమే దాగి వుండొచ్చు..’ అని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయినా, ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు రాజ్యమే నడుస్తుందని అంత బలంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నమ్ముతున్నప్పుడు, తన పరిధిలో వున్న హోంశాఖ ద్వారా తగిన చర్యల్ని ఆయన తీసుకోలేరా.?