హుజూరాబాద్ ఎన్నికల్లో ఓటమి వల్లే సీఎం టీఆర్ఎస్ కు రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు గుర్తొచ్చాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై ఎన్నికల ముందు ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఓ హోటల్లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. దేశవ్యాప్తంగా బాయిల్డ్ రైస్ వినియోగం తగ్గిందన్నారు. బాయిల్డ్ రైస్ మిల్లుల్లోనే తయారవుతోందన్నారు. ధాన్యం, బియ్యం సేకరణకు 2014లో 3,400 కోట్లు ఖర్చు చేస్తే.. 2021లో 26,600 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు.
డబ్ల్యూహెచ్ఓ నిబంధనల ప్రకారం కేంద్రం విదేశాలకు బియ్యం ఎగుమతి చేయలేదని.. ప్రైవేటు వారిని ప్రోత్సహిస్తున్నా ఎవరూ ముందుకు రావట్లేదని అన్నారు. ఒప్పందం ప్రకారం రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేస్తామని అన్నారు. భద్రాచలంకు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేస్తే రైల్వే లైన్ వేస్తామని అన్నారు. ఘట్ కేసర్ నుంచి యాదాద్రి వరకూ ఎంఎంటీఎస్ కోసం రైల్వే లైన్ వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.