iఆయన నోటికి హద్దూ అదుపూ లేదు. చాలామంది ఆయన్ని ‘బూతుల మంత్రి’ అని పిలుస్తుంటారు. ‘నేను బూతులు మాట్లాడుతున్నానా.? అందరూ మాట్లాడే మాటలే మాట్లాడతాను. నాకు సెన్సార్ వుండదు. ఎవరి మెప్పు కోసమో మంచి మాటలు మాట్లాడేయాలన్న ఆలోచన నాకుండదు..’ అంటారాయన. పరిచయం అక్కర్లేని పేరది రాష్ట్ర రాజకీయాల్లో. ఎందుకంటే, ఆయన బూతులు అంతలా ఫేమస్ మరి.! ఆయనే, మంత్రి కొడాలి నాని.
ఇప్పుడీయన వ్యవహారశౖలిపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్, రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో కొడాలి నాని నోటికి తాళం పడుతుందని అనుకోలేం. ఎందుకంటే, న్యాయస్థానాలు మొట్టికాయలేసినా చాలామంది వైసీపీ నేతలు తమ ప్రవర్తన మార్చుకోలేకపోతున్నారు. అధినేత మెప్పు కోసం ఏ స్థాయికైనా దిగజారడానికి వైసీపీ నేతలు వెనుకంజ వేయడంలేదు మరి.
ఓ మామూలు రాజకీయ నాయకుడు నోటికొచ్చినట్లు మాట్లాడటమే సమర్థనీయం కాదు. అలాంటిది, మంత్రి పదవిలో వున్న వ్యక్తి, ‘ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ నియామకం మళ్ళీ జరిగితే, ఆయనేమన్నా మా వెంట్రుకలు పీకుతాడా.?’ అంటూ ఓ సందర్భంలో కొడాలి నాని నోటికొచ్చినట్లు మాట్లాడిన వైనాన్ని ఎలా మర్చిపోగలం.? తాజాగా, ‘పదవికి రాజీనామా చేసేసి, తెలుగుదేశం పార్టీలో చేరిపో..’ అంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కి ఉచిత సలహా ఇచ్చేశారు కొడాలి నాని. ఈ అంశాలన్నిటిపైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, గవర్నర్‌కి నిమ్మగడ్డ ఫిర్యాదు చేశారట.
కొడాలి నానితోపాటు పలువురు మంత్రుల పేర్లనూ, వారు తనపై చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియోలనూ గవర్నర్‌కి అందించారట నిమ్మగడ్డ. ఇవే కాదు, ముఖ్యమంత్రి గతంలో తనకు కులాన్ని ఆపాదిస్తూ చేసిన వ్యాఖ్యల వ్యవహారాన్ని కూడా నిమ్మగడ్డ గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళినట్లు తెలుస్తోంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంస్కరణలంటూ తెచ్చిన ఆర్డినెన్స్ నేపథ్యంలో నిమ్మగడ్డ ఉద్వాసనకు గవర్నర్ సంతకం చేసిన విషయం విదితమే. మరి, అదే గవర్నర్.. ఇప్పుడు మంత్రులపై నిమ్మగడ్డ ఫిర్యాదు నేపథ్యంలో అసలు చర్యలు తీసుకుంటారా.? అన్నది చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణ విషయమై ఎస్‌ఈసీ నిమ్మగడ్డకీ, అధికార పార్టీకీ మధ్య ‘రచ్చ’ జరుగుతోంది చాలాకాలంగా. కాగా, స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో ఎస్ఈసీకి వ్యతిరేకంగా ఉద్యోగుల్ని ఉసిగొల్పుతున్న వైనాన్ని కూడా నిమ్మగడ్డ గవర్నర్ ముందుకు తీసుకెళ్ళారట.