గన్నవరం విమానాశ్రయం విస్తరణ కోసం కృష్ణా జిల్లా కేసరపల్లిలో తమకున్న భూముల్లో ఉన్న నిర్మాణాలకు, పండ్ల తోటలకు ఎలాంటి పరిహారం చెల్లించకుండానే స్వాధీనం చేసుకునేందుకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాప్రయత్నిస్తోందంటూ సీనియర్ నటుడు కృష్ణంరాజు దంపతులు సోమవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఏఏఐ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు.
ఇదిలా ఉండగా, విమానాశ్రయం విస్తరణ కోసం తానిచ్చిన 39 ఎకరాల భూమికి గాను భూ సేకరణ చట్టం కింద రూ.210 కోట్లను చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏఏఐని ఆదేశించాలని కోరుతూ నిర్మాత చలసాని అశ్వనీదత్ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. గన్నవరంలో తానిచ్చిన 39 ఎకరాల భూమి ప్రస్తుతం ఎకరా రూ.1.84 కోట్లు చేస్తుందని, భూ సేకరణ చట్టం కింద ఈ మొత్తానికి నాలుగు రెట్లు ఇచ్చేలా ఆదేశించాలని కోరారు.