సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు పొరపాటైందంటూ చెంపలేసుకున్నారు. అది కూడా జర్నలిస్టుల గురించి మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే…
ఏ విషయంపైనైనా ధైర్యంగా తన అభిప్రాయాలను వెల్లడించడంలో నటి ఖుష్బూ ముందు వరుసలో ఉంటారు. తాజాగా ఆమె జర్నలిస్టులకు సంబంధించి మాట్లాడిన ఆడియో టేపులు లీక్ కావడంతో వివాదంలో చిక్కుకున్నారు. టీవీ సీరియల్స్ షూటింగ్స్ తిరిగి ప్రారంభించడంపై ఆమె మాట్లాడిన ఆడియో టేప్ వాట్సాప్ గ్రూపుల్లో లీకైంది.
ఈ టేప్‌లో ఖుష్బూ …‘జర్నలిస్టులకు కోవిడ్ తప్ప ఏ వార్తలూ లేవు. త్వరలో షూటింగ్స్ ప్రారంభమవుతున్నందున జర్నలిస్టులు ఫొటోలు, వీడియోల కోసం వెంటపడతారు. కానీ అస్సలు ఇవ్వొద్దు. సొంత కథలు అల్లుతూ మనల్ని చీల్చి చెండాడేందుకు జర్నలిస్టులు సిద్ధంగా ఉన్నారు. కావున జాగ్రత్తగా ఉండండి’ అని ఆమె అన్నారు.
ఈ మాటలు జర్నలిస్టులకు కోపం తెప్పించాయి. ఈ నేపథ్యంలో ఆమె ట్విటర్ వేదికగా స్పందిస్తూ తన వాయిస్‌ను కొంత ఎడిట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, ఆ ఆడియోపై ఆమె మరింత వివరణ ఇచ్చారు.
‘నిర్మాతల గ్రూప్‌లో నుంచి ఒకరు దాన్ని ఉద్దేశ పూర్వకంగానే లీక్ చేశారు. ఇలాంటి వ్యక్తుల మధ్య ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను. జర్నలిస్టులను అగౌరవపర్చడం ఎంత మాత్రం నా ఉద్దేశం కాదు. కేవలం స్నేహితుల దగ్గర ఎలా మాట్లాడతామో అలాగే మాట్లాడాను. నాకు ప్రెస్పై ఎంత గౌరవం ఉందో పాత్రికేయులందరికీ తెలుసు. 34 ఏళ్ల సినీ జీవితంలో ఒక్కసారి కూడా వాళ్లను కించపరుస్తూ మాట్లాడలేదు. తాజాగా ఒకవేళ ఎవరినైనా బాధపెట్టుంటే వారికి నా హృదయపూర్వక క్షమాపణలు” అంటూ ఆమె సమస్యకు ముగింపు పలికేందుకు తన వంతు బాధ్యతను నిర్వర్తించారు.
అయితే ఆమె కోపమంతా ఆ ఆడియో క్లిప్ లీక్ చేసిన నిర్మాతపైనే. అతనెవరో కూడా తనకు తెలుసని ఖుష్బూ అన్నారు. కానీ తన మౌనం, క్షమాగుణమే అతనికి పెద్ద శిక్ష అని పేర్కొన్నారు. ఓ పథకం ప్రకారమే ఖుష్బూ మాటల ఆడియోను లీక్ చేశారని అర్థమవుతోంది.