దేశంలో మరోసారి లాక్‌డౌన్‌ని పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. మే 17వ తేదీ వరకు లాక్‌డౌన్ దేశంలో కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. అయితే, రెడ్ జోన్లలో లాక్‌డౌన్ కరినంగా అమలు కానుండగా, గ్రీన్ మరియు ఆరెంజ్ జోన్లకు చాలా వెసులుబాట్లు కల్పించారు.
అన్ని జోన్లలోనూ సినిమా ది¸యేటర్లు, విద్యా సంస్థలు, క్రీడా ప్రాంగణాలు, రెస్టారెంట్లు, మతపరమైన కేంద్రాల మూసివేత కొనసాగుతుంది. వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణీలు ఇళ్ళకే పరిమితం కావాల్సి వుంటుంది. ఇక, ఆరెంజ్ జోన్లలో కొన్ని వెసులుబాట్లు కల్పించగా, గ్రీన్ జోన్లలో అన్నిరకాల కార్యకలాపాలకూ అనుమతినివ్వడం గమనార్హం. 50 శాతం ప్రయాణీకులతో బస్సులు కూడా గ్రీన్ జోన్‌లో తిరుగుతాయి. గ్రీన్ జోన్లలో మద్యం దుకాణాలకు సైతం అనుమతినివ్వడం గమనార్హం.
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని నిషేధిస్తూనే, పాన్ – గుట్కా వంటి విక్రయాలకు ‘గ్రీన్’ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. ఆయా దుకాణాల్లో ఒకేసారి ఐదుగురి కంటే ఎక్కువమంది వుండకూడదు.. సోషల్ డిస్టెన్స్ తప్పనిసరి.
ఇదిలా వుంటే, దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే లాక్‌డౌన్‌ని పొడిగిస్తున్నట్లు కేంద్రం చెబుతున్నా, గ్రీన్ మరియు ఆరెంజ్ జోన్లలో కొన్ని కార్యకలాపాలకు ‘గ్రీన్’ సిగ్నల్ ఇవ్వడం విశేషమే మరి.
మరోపక్క, లాక్‌డౌన్ అనంతరం తెరచుకునే విద్యా సంస్థలకు సంబంధించి కూడా మార్గదర్శకాలు జారీ అయ్యాయి. విద్యా సంస్థల్లో కొత్త సీటింగ్ అరేంజ్‌మెంట్ తప్పనిసరి. షిఫ్టుల వారీగా క్లాసులు.. ఉదయాన్నే స్కూల్‌లో నిర్వహించే ‘అసెంబ్లీ’ సహా స్పోర్ట్స్ వంటివి రద్దు చేయాలని సూచించింది కేంద్రం. కాగా, కేసుల సంఖ్య తగ్గే కొద్దీ రెడ్ జోన్లు తగ్గుతాయనీ, గ్రీన్ జోన్లు పెరుగుతాయని కేంద్రం అంచనా వేస్తోంది.