మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కరోనా ఎఫెక్ట్ దెబ్బ వేసిన సంగతి తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ ఇంకా దాదాపు 20 శాతం జరగాల్సి ఉంది. షూటింగ్ కు అనుమతి దొరికాక వీలైనంత త్వరగా సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చి ముందు చెప్పినట్లుగానే సంక్రాంతికి సినిమాను విడుదల చేద్దామని ఆశిస్తున్నాడు రాజమౌళి.
ఇదిలా ఉంటే ఇటీవలే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా చరణ్ ఫుటేజ్ ను విడుదల చేసి ఖుషీ చేసాడు రాజమౌళి. చరణ్ విజువల్స్ కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో ఇరు వర్గాల ఫ్యాన్స్ ను సంతృప్తి పరిచాడు. అప్పటికి లాక్ డౌన్ అమలైనప్పటికీ తమ దగ్గర ఫుటేజ్ సిద్ధంగా ఉండడంతో దానికి చిన్న చిన్న మెరుగులు దిద్ది వీడియోను అనుకున్నట్లుగా విడుదల చేసారు.
రామ్ చరణ్ పుట్టినరోజుకు చేసినట్లుగానే ఎన్టీఆర్ పుట్టినరోజుకు కూడా రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో వీడియోను రూపొందించాలని రాజమౌళి భావించాడు. అయితే లాక్ డౌన్ పూర్తయితేనే పనులు ముందుకు సాగుతాయి. ఎందుకంటే ఎన్టీఆర్ కు సంబంధించిన ఫుటేజ్ తమ వద్ద అందుబాటులో లేదు.
అయితే ప్రస్తుతం లాక్ డౌన్ ను మూడో సారి పొడిగించారు. మే 17 వరకూ లాక్ డౌన్ ఉంటుంది. 18 నుండి పూర్తిగా ఎత్తేవేసే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే ఎన్టీఆర్ పుట్టినరోజుకు వీడియో కాకుండా పోస్టర్ తో సరిపెట్టే అవకాశాలు ఉన్నాయి.