గత కొంత కాలంగా కరణం మల్లీశ్వరి బయోపిక్ గురించి వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. ఇండియా తరుపున ఒలింపిక్ మెడల్ గెలుచుకున్న తొలి మహిళగా కరణం మల్లీశ్వరి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. చెప్పాలంటే అప్పటినుండి మహిళలు ఒలింపిక్స్ ను మరింత సీరియస్ గా తీసుకోవడం మొదలుపెట్టారు.
ఎన్నో లక్షల మందికి తన ఆటతో స్ఫూర్తినిచ్చిన కరణం మల్లీశ్వరి శ్రీకాకుళానికి చెందిన ఒక అతి సాధారణ కుటుంబం నుండి వచ్చింది. ఆమె కెరీర్ లో ఎన్నో ఆటుపోట్లున్నాయి. ఒలింపిక్ మెడల్ గెలుచుకోవడానికి ముందు ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నారు. మొత్తంగా చెప్పాలంటే ఆమె జీవితం ఎందరికో ఆదర్శవంతం. ఇలాంటి వ్యక్తి జీవితాన్ని సినిమాగా మలిస్తే మరింత మందికి చేరువవుతుంది. ఇప్పుడు అలాంటి ప్రయత్నమే జరుగుతోంది.
మహానటి తర్వాత తెలుగులో కూడా బయోపిక్ ల జోరు ఊపందుకుంది. ఇప్పుడు అదే కోవలో కరణం మల్లీశ్వరి బయోపిక్ ను తెరకెక్కిస్తున్నారు. కోన వెంకట్ సహ నిర్మాతగా ఆయనే కథ స్క్రీన్ ప్లే అందించగా ఎంవివి సత్యనారాయణ నిర్మాణంలో ఈ బయోపిక్ తెరకెక్కనుంది. సంజన రెడ్డి దర్శకురాలిగా ఈ చిత్రంతో పరిచయం కానుంది. ఈరోజు కరణం మల్లీశ్వరి పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసారు. ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి టైటిల్ రోల్ ఎవరు పోషిస్తారు అనే విషయమ్మీద ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు.