ఇంతలోనే అంతా రివర్సయ్యింది. `మా` అసోసియేషన్ ఎన్నికల్లో కౌంటింగ్ ఫేజ్ మారుతోంది. తొలుత మంచు విష్ణు ప్యానెల్ దూకుడును ప్రదర్శిస్తున్నట్టు కనిపించినా ఇంతలోనే ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి దూకుడు మొదలైంది. తాజా సమాచారం మేరకు.. ప్రకాష్ రాజ్ కి 12 లీడ్ దక్కగా… విష్ణుకు 6 లీడ్ కనిపించింది. అంతేకాదు.. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి తొలి గెలుపు ఖాయమైంది. నటుడు శివారెడ్డి అత్యథిక మెజారిటీతో గెలుపొందగా.. ఇదే ప్యానెల్ నుంచి కౌశిక్- సురేష్ కొండేటి- యాంకర్ అనసూయ గెలుపొందారు. ఇప్పటికే నలుగురు సభ్యులను గెలుపు వరించింది.
ఆరంభం విష్ణుకు 10 లీడ్ .. ప్రకాష్ రాజ్ కి 8 లీడ్
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అన్ని అంచనాలను తలకిందులు చేస్తూ ప్రకాష్ రాజ్ ప్యానెల్ తో పోలిస్తే మంచు విష్ణు ప్యానెల్ ఒకడుగు ముందంజలో ఉందని తొలుత ఫలితం వచ్చింది. విష్ణు ప్యానెల్ నుంచి 10 మంది ఈసీ సభ్యులు మెజారిటీ సాధించగా… 8 మంది ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి మెజారిటీ తో దూసుకెళుతున్నారని తొలిగా రిపోర్ట్ అందింది. కానీ ఇంతలోనే అంతా మారింది. ఇంచుమించు 60 శాతం తో విష్ణు.. 40శాతంతో ప్రకాష్ రాజ్ రేస్ లో ఉన్నారని ఆరంభం రిపోర్ట్స్ అందినా కానీ చూస్తుండగానే అంతా మారిపోయింది. ఒక్కసారిగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ గ్రాఫ్ పెరిగి 12కి లీడ్ పెరిగింది. మరోవైపు విష్ణు లీడ్ 10 నుంచి 6 కి పడిపోవడం చర్చనీయాంశమైంది.
తొలుత అటూ ఇటూ తారుమారు అయ్యేందుకు ఆస్కారం లేకపోలేదని విశ్లేషించిన చందంగానే ప్రకాష్ రాజ్ లీడ్ లోకి వచ్చారు. అయితే ఇది మునుముందు మారే ఛాన్స్ లేకపోలేదు. ఫైనల్ రిజల్ట్ కూడా తక్కువ మార్జిన్ తో ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఈ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ భారీగా జరిగిందని చెబుతున్నారు. ఇకపోతే ఈసారి ఓట్లు అధికంగా పోల్ అవ్వడానికి కారణం మంచు విష్ణు అన్న చర్చా సాగుతోంది. ఇక విష్ణు ఇంతకుముందు చిరంజీవి అంకుల్ కూడా తనకే ఓటేస్తారని అనడం.. మోహన్ బాబు కూడా సీరియస్ గా సీనియర్ ఆర్టిస్టులకు ఫోన్ లు చేసి ఓటేయాలని కోరడం.. ఇవన్నీ యువనాయుకుడికి కొంతవరకూ ఫేవర్ గా పని చేసాయని భావిస్తున్నారు. కానీ ప్రకాష్ రాజ్ ప్యానెల్ అనూహ్యంగా పుంజుకుంది. తొలి నుంచి ప్యానెల్ ని ప్రకటించి దూకుడుగా వ్యవహరించిన ప్రకాష్ రాజ్ కష్టం ఫలిస్తున్నట్టే కనిపిస్తోంది. ఇరు ప్యానెళ్ల నుంచి ఓవరాల్ గా 36 మంది (18 ప్లస్ 18) సభ్యులు పోటీపడుతున్నారు. మరో గంటన్నరలో ఫైనల్ రిజల్ట్ వచ్చేస్తుందని భావిస్తున్నారు.