విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల గత నెల రోజులుగా కార్మికులు మరియు ఏపీ విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ఇటీవల మోసగాళ్లు సినిమా ప్రమోషన్ కోసం వెళ్లిన మంచు విష్ణును విశాఖ ఉక్కు ఉద్యమంకు మద్దతు తెలపాలని కొందరు ఉద్యమ నాయకులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మోసగాళ్లు సినిమా ప్రమోషన్ సందర్బంగా మంచు విష్ణు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటంకు తన మద్దతు పలికాడు. ఈ సందర్బంగా ఆయన కార్మికులకు సంఘీభావం తెలియజేశాడు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీసుకున్న నిర్ణయంను నూటికి నూరు శాతం తప్పుగానే తాను భావిస్తున్నట్లుగా పేర్కొన్నాడు. ఎంతో మంది రైతులు మరియు శ్రామికుల త్యాగ ఫలితం విశాఖ ఉక్కు. దీన్ని ప్రైవేటీకరణ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం పట్ల మంచు విష్ణు వ్యతిరేకత వ్యక్తం చేశాడు. ప్రతి ఒక్క తెలుగు వారు ఈ విషయమై పార్టీలకు అతీతంగా పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చాడు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమంలో తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన వారు కూడా పాల్గొనాలంటూ పిలుపునిచ్చాడు.