లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం గురించి ఎప్పుడు తలుచుకున్నా చాలా సీరియస్ మూడ్లో ఉన్న ముఖచిత్రం గుర్తుకొస్తుంది. ఆయన ముభావి. ఎక్కువగా మాట్లాడడు. ప్రచారానికి చాలా దూరంగా ఉంటాడు. బయట కనిపించడమే తక్కువ. వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుతాడు. మణిరత్నంకు సంబంధించిన ఫొటోలు కూడా పెద్దగా బయటికి రావు. సెట్లో ఆయనెలా ఉంటాడన్నది కూడా చాలామందికి తెలియదు. అలాంటి వ్యక్తిని ఒక రొమాంటిక్ ఫొటోకు ఒప్పించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది బాలీవుడ్ భామ అదితి రావు హైదరి.
ఈ అమ్మాయిపై మణిరత్నంకు బాగా గురి. తనను దక్షిణాది సినిమాకు పరిచయం చేసింది ఆయనే. ‘చెలియా’ సినిమాతో అదితి తమిళ, తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆమె అందం, అభినయం మెచ్చి తర్వాతి సినిమా ‘చిక్క చివంత వానం’ (తెలుగులో నవాబ్)లోనూ అవకాశమిచ్చాడు మణిరత్నం.
అంతటితో ఆగకుండా తన కొత్త సినిమా ‘పొన్నియన్ సెల్వన్’ కోసం కూడా అదితిని తీసుకున్నాడు. ఆమెపై ఆయనకెంత అభిమానమో.. అదితికి కూడా మణిరత్నం అంటే అంత గౌరవం. ఆయన వ్యక్తిత్వం గురించి గతంలో చాలా గొప్పగా మాట్లాడింది. తాజాగా ఆమె మణిరత్నంకు రోజా పువ్వు ఇస్తూ ప్రపోజ్ చేస్తుండగా.. ఆయన నవ్వుతూ దాన్ని స్వీకరించే ప్రయత్నం చేశాడు. ఈ దృశ్యాన్ని ఫొటో తీశారు. అది ట్విట్టర్లోకి వచ్చింది.
మణిరత్నంను ఇలా ఎప్పుడూ చూడని అభిమానులు.. ఇలాంటి ఫొటోకు ఒప్పించిన అదితి గట్టిదే అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫొటోను మణిరత్నం మిత్రుడైన మరో లెజెండరీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా షేర్ చేశాడు. మణిరత్నంను ఇంత రొమాంటిగ్గా తాను ఎప్పుడూ చూడలేదంటూ వర్మ కూడా ఆశ్చర్యపోతూ ట్వీట్ వేశాడు. ఈ రోజుకు ట్విట్టర్ జనాలకు ఈ ఫొటో మంచి కాలక్షేపమే అందిస్తోంది.