మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తోన్న ఆచార్య తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా చేయబోతున్న చిత్రం లూసిఫెర్ రీమేక్. ఎప్పటినుండో ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం మొత్తానికి సెప్టెంబర్ నుండి పట్టాలెక్కుతోంది. మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకుడు అన్న విషయం అధికారికంగా ప్రకటించారు కూడా. ఎన్వీ ప్రసాద్ తో పాటు రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తాడు.
లూసిఫెర్ రీమేక్ కు చిరంజీవి అండ్ కో ఆసక్తికర టైటిల్ ను అనుకున్నారు. ముందు చాలా టైటిల్స్ పరిగణలోకి తీసుకున్నా కానీ గాడ్ ఫాదర్ కే ఓటు వేశారు. కానీ ఆ టైటిల్ ను సంపత్ నంది రిజిస్టర్ చేయించుకున్నాడు.
తాను రాసుకున్న యాక్షన్ థ్రిల్లర్ కోసం ఆ టైటిల్ ను అనుకున్నాడు. కానీ మెగాస్టార్ అడిగితే కాదంటాడా? స్వయంగా చిరంజీవి నుండి ఫోన్ రావడంతో సంతోషంగా తన టైటిల్ ను త్యాగం చేసాడు. పైగా మెగాస్టార్ తో ఒక సెల్ఫీ దిగి తన ఆనందాన్ని అందరితో పంచుకున్నాడు సంపత్ నంది.