తనను ఆర్ధికంగా తీవ్రంగా నష్టాలపాలు చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను హత్య చేయాలనుకున్నది నిజమేనని నిందితుడు రాఘవేంద్ర రాజు పోలీసుల విచారణలో వెల్లడించారు. తన వ్యాపారాలు దెబ్బతీసి.. ఆర్ధికంగా నష్టం చేకూర్చి తనను తీవ్ర మానసిక ఇబ్బందులకు గురి చేశారని అన్నాడు. స్థిరాస్తి వ్యాపారాన్ని దెబ్బ తీయడం, బార్లు మూసేయించడం, ఆధార్ ఎన్ రోల్ మెంట్ సెంటర్ కూడా మంత్రి రద్దు చేయించాడని.. విసుగెత్తిపోయి మంత్రి హత్యకు కుట్ర పన్నినట్టు పోలీసులకు తెలిపాడు.
ఈ కేసును పోలీసులు చేధించి ఇప్పటివరకూ 8 మందిని అరెస్టు చేసినట్టు తెలిపారు. నిందితులను కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. పేట్ బషీర్ బాద్ పోలీసులు దీనిపై మేడ్చల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. హత్యకు కుట్రలో బీజేపీ నాయకుల పాత్ర ఉందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. వాటిని బీజేపీ నేతలు ఖండిస్తున్నారు.