తెలుగులో బయోపిక్స్ చాలా తక్కువే. బాలీవుడ్ లో స్పోర్ట్స్ లెజండ్స్, నటులకు సంబంధించిన బయోపిక్స్ విరివిగా వస్తున్నా టాలీవుడ్ ఎందుకనో దానిపై అంతలా దృష్టి సారించలేదు. అయితే రెండేళ్ల కేవలం ఒక్క సినిమా అనుభవమున్న నాగ్ అశ్విన్ సావిత్రమ్మ బయోపిక్ తో మహానటి సినిమాను తెరకెక్కిస్తున్నప్పుడు అందరూ ఎందుకొచ్చిన రిస్క్ అనే అనుకున్నారు. అయితే మహానటి చిత్రంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు నాగ్ అశ్విన్.
ఒక బయోపిక్ ను పెర్ఫెక్ట్ గా ఎలా తీయవచ్చో ప్రభావవంతంగా చూపించాడు. మహానటి సినిమా ప్రేక్షకుల మనసును గెలుచుకోవడమే కాదు అవార్డులను సైతం కైవసం చేసుకుంది. మహానటి చిత్రానికి జాతీయ స్థాయి అవార్డు వచ్చింది. దీంతో నాగ్ అశ్విన్ పేరు మార్మోగిపోయింది.
మహానటి తర్వాత రెండేళ్ల విరామం తర్వాత ఇప్పుడు ప్రభాస్ తో ప్రాజెక్ట్ ను ఓకే చేసుకున్నాడు నాగ్ అశ్విన్. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే నాగ్ అశ్విన్ ఒక్కసారి బయోపిక్ తీసి సంచలనం సృష్టించడంతో ఈ దర్శకుడికి ఈ తరహా ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయి.
కాకపొతే ఇకపై బయోపిక్ లు తీయకూడదని నాగ్ అశ్విన్ బలంగా ఫిక్స్ అయ్యాడట. సావిత్రమ్మ అంటే నాకు అమితమైన అభిమానం. అందుకే ఆమె బయోపిక్ తీయాలని, ఆ ప్రయాణాన్ని ఆస్వాదించాలని ఎప్పటినుండో ప్రయత్నిస్తున్నాను. ఇదే తరహా భావన ప్రతి బయోపిక్ కు రాదు. అందుకే వాటిని నేను పూర్తిగా ఆస్వాదించి తీయలేను అని తెలిపాడు.