కరోనా విపత్తు నేపథ్యంలో సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు చిరంజీవి సారధ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి చర్చించిన విషయం తెల్సిందే. ఆ సమావేశంకు తనను ఆహ్వానించక పోవడంపై బాలకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. హైదరాబాద్‌లో భూములను పంచుకునేందుకు ఆ సమావేశం జరిగిందేమో అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంను రేపాయి. మెగా బ్రదర్ నాగబాబు తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా బాలకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. వెంటనే క్షమాపణ చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేశాడు.
నాగబాబు వ్యాఖ్యలను సమర్ధించిన వారు కొందరు అయితే బాలకృష్ణ వ్యాఖ్యలను స్పందించినది కొందరు. మొత్తానికి బాలకృష్ణ వర్సెస్ నాగబాబు అన్నట్లుగా పరిస్థితి చాలా సీరియస్ అయ్యింది. ఈ నేపథ్యంలో మీడియాలో వస్తున్న కథనాలు పరిస్థితిని మరింత సీరియస్ చేస్తున్నాయి. దాంతో నాగబాబు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూతో ఈ వివాదంకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు. బాలకృష్ణతో నాకు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ఎలాంటి వివాదం విభేదం లేదు. సినిమా ఇండస్ట్రీ గురించి ఆయన తప్పుగా మాట్లాడటం వల్ల నేను స్పందించాల్సి వచ్చింది.
బాలకృష్ణ కాకుండా మరెవ్వరు అలాంటి వ్యాఖ్యలు చేసినా కూడా నేను స్పందించేవాడినే. బాలకృష్ణ ఒక హీరో. నేను ఒక నటుడిని, నిర్మాతను. ఆయనతో నేను సమానం అని ఎప్పటికి చెప్పుకోను. నాకు బాలకృష్ణతో పెద్దగా పరిచయం కూడా లేదు. బాలయ్య మాటలను కొట్టి పారేసేలా వ్యాఖ్యలు చేశాను తప్ప ఆయన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసేలా మాత్రం మాట్లాడలేదు అంటూ స్పష్టం చేశాడు.
ఈ విషయాన్ని మీడియా ఎక్కువ చేసిందని ఇండస్ట్రీలో ఏ చిన్న విషయం జరిగినా మీడియాలో మాత్రం మూడవ ప్రపంచ యుద్దం స్థాయిలో పబ్లిసిటీ చేస్తున్నారు అంటూ నాగబాబు అసహనం వ్యక్తం చేశాడు. మొత్తానికి బాలకృష్ణ విషయంలో నాగబాబు ఈ వ్యాఖ్యలు చేయడంతో వివాదం కాస్త చల్లబడ్డట్లుగానే అనిపిస్తుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.