అక్కినేని నాగార్జున కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు ఉన్నా ఈ దశాబ్దంలో అతి పెద్ద హిట్ గా సోగ్గాడే చిన్ని నాయన గురించి చెప్పుకోవచ్చు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఏకంగా 50 కోట్ల పైచిలుకు షేర్ ను రాబట్టింది ఈ సినిమా. ముఖ్యంగా ఈ చిత్రంలో నాగార్జున పోషించిన బంగార్రాజు పాత్ర జనాల్ని విపరీతంగా ఆకర్షించింది. అప్పట్లోనే ఈ సినిమాకు ప్రీక్వెల్ గా బంగార్రాజు చిత్రముంటుందని తెలిపాడు దర్శకుడు. సోగ్గాడే చిన్ని నాయనలో కేవలం ఆత్మగానే ఉండిపోయిన బంగార్రాజు పాత్ర మెయిన్ గా ఈ ప్రీక్వెల్ ఉంటుందని తెలిపాడు. అయితే అప్పటినుండి ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి బోలెడన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
మొత్తంగా నాగ్ ను తన స్క్రిప్ట్ తో ఒప్పించిన దర్శకుడు ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టాడు. అయితే గత కొన్ని రోజుల నుండి ఈ సినిమా చేయకూడదని నాగ్ డిసైడ్ అయినట్లుగా వార్తలు వచ్చాయి. దానికి కారణం.. నాగ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మరో చిత్రం ఒప్పుకోవడమే.
అయితే ఈ విషయంలో ఎటువంటి నిజం లేదని తెలుస్తోంది. బంగార్రాజు ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయట. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, అనూప్ రూబెన్స్ తో ఇప్పటికే ఆన్లైన్ మ్యూజిక్ సిట్టింగ్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మూడు ట్యూన్లు కూడా సిద్ధమయ్యాయట. అక్టోబర్ నుండి షూటింగ్ ను మొదలుపెట్టి శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఇది సాధ్యమవుతుందా అన్నది చూడాలి.