‘‘విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దు. మెంటల్ మామ కొమ్ములు వంచి పరీక్షలు రద్దు చేయించే బాధ్యత నాది. దేశ్యాప్తంగా తుగ్లక్ నిర్ణయాల గురించి చర్చ జరుగుతుంది. థర్డ్ వేవ్ హెచ్చిరికల దృష్ట్యాపరీక్షలు నిర్వహించడం ప్రమాదం.. పరీక్షల రద్దు నిర్ణయాన్ని ప్రకటించేవరకూ న్యాయపోరాటాన్ని కొనసాగిస్తాను..’’ అంటూ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల విషయమై ఇటు విద్యార్థులకు, అటు వారి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్.. ఎట్టకేలకు విజయం సాధించారు.
సుప్రీంకోర్టు చీవాట్లతో ప్రభుత్వం.. చేసేది లేక దిగొచ్చిందా.? లేదంటే, ఇంకో ‘బలమైన’ కారణం ఏదైనా వుందా.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ‘మెంటల్ఓ మామ కొమ్మలు వంచి పరీక్షలు రద్దు చేయించిన లోకేష్ అన్న..’ చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో, విద్యార్థులు పరీక్షలు రాసేందుకు మానసికంగా సిద్ధంగా లేరన్నది నిర్వివాదాంశం. కొందరు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కరోనా సెకెండ్ వేవ్ పట్ల తీవ్రంగా ప్రభావితమయ్యారు. వారిలో కొందరు ప్రాణాలు కోల్పోయారు కూడా. సెకెండ్ వేవ్ ముప్పు పూర్తిగా తొలగిపోలేదు ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో.
అదే సమయంలో మూడో వేవ్ పొంచి వుంది. ఈ నేపథ్యంలో పరీక్షలెలా నిర్వహించడం.? అన్న కనీసపాటి మానవీయ కోణం ప్రభుత్వ పెద్దల్లో కొరవడింది. దాంతో, విపక్షాలు ఆందోళన బాట పట్టాల్సి వచ్చింది. టీడీపీ, జనసేన సహా అన్ని రాజకీయ పార్టీలూ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వ ఆలోచనను తప్పు పట్టాయి. మరోపక్క, సుప్రీంకోర్టు ఈ అంశంపై తీవ్రంగా స్పందించింది. ఆంధ్రపదేశ్ ఒక్కటే కాదు, పరీక్షలపై మొండి పట్టుదల ప్రదర్శిస్తున్న పలు రాష్ట్రాలపై గుస్సా అయ్యింది.
15 మంది విద్యార్థులకి ఓ గది.. అంటూ కథలు చెప్పడానికి ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తే, సుప్రీంకోర్టు ససేమిరా అనేసింది. ఎన్ని చర్యలు తీసుకున్నా విద్యార్థుల్ని కరోనా బారి నుంచి కాపాడలేమని స్పష్టం చేసింది. కాదని మొండికేస్తే, ఏ విద్యార్థి మరణించినా కోటి రూపాయలు పరిహారం ఇవ్వాల్సి వస్తుందని అల్టిమేటం జారీ చేసింది సర్వోన్నత న్యాయస్థానం. దాంతో, జులై 31 లోగా పరీక్షల ఫలితాలు వెల్లడించాలని సుప్రీంకోర్టు చెప్పిందనీ.. అది సాధ్యం కాదు గనుక, పరీక్షలు రద్దు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది. కానీ, ఇది విద్యార్థి లోకం.. ప్రభుత్వంపై సాధించిన విజయం.
సోనూ సూద్ నుంచి రాష్ట్రపతి వరకు.. ప్రతి ఒక్కరినీ విద్యార్థులు వేడుకున్నారు సోషల్ మీడియా వేదికగా. అలా ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. ఈ మొత్తం వ్యవహారంలో నారా లోకేష్, విద్యార్థి లోకానికి అండగా నిలిచిన తీరు ముమ్మాటికీ అద్భుతం. ‘మెంటల్ మామ కొమ్ములు వంచిన నారా లోకేష్..’ అన్న టీడీపీ శ్రేణుల ప్రస్తావనని తేలిగ్గా కొట్టి పారేయలేం. ప్రభుత్వాలు అహంకారాన్ని ప్రదర్శించినప్పుడు, విపక్షాలు గట్టిగా నిలబడితే.. అధికారం అనే కొమ్ములు వంచడం పెద్ద విషయమేమీ కాదని ఇంకోసారి నిరూపితమయ్యిందంతే.