రాజకీయాల్లో విమర్శలు అత్యంత జుగుప్సాకరమైన స్థాయికి ఎప్పుడో చేరిపోయాయి. ఆ పార్టీ, ఈ పార్టీ అన్న తేడాల్లేవ్.. అన్ని పార్టీలదీ అదే తీరు. ఒకర్ని మించి ఇంకొకరు రాజకీయాల స్థాయిని దిగజార్చేందుకు తమవంతుగా కృషి చేస్తున్నారు. స్వాంత్రత్య దినోత్సవ సంబరాలు ఓ వైపు జరుగుతుండగా, ఇంకో వైపు గుంటూరులో ఓ యువతి నడి రోడ్డు మీద దారుణ హత్యకు గురైంది. బీటెక్ విద్యార్థిని రమ్య హత్యతో ఒక్కసారిగా అంతా షాక్‌కి గురయ్యారు. చిత్రమేంటంటే, ‘నిర్భయ’కి వచ్చిన ప్రచారం, ‘దిశ’ చుట్టూ జరిగిన హంగామా.. ‘రమ్య హత్య’ ఘటనపై జరగలేదు. బాధిత కుటుంబానికి 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నట్టు వ్యవహరించింది వైఎస్ జగన్ ప్రభుత్వం. నిందితుడ్ని పోలీసులు పట్టుకున్నారనుకోండి.. అది వేరే సంగతి.
ఈ విషయమై తెలుగుదేశం పార్టీ పోరు బాట పట్టింది. అన్ని రాజకీయ పార్టీలూ విద్యార్థిని రమ్య హత్య ఘటనను తీవ్రంగా ఖండించాయి. కాగా, బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్ళిన నారా లోకేష్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకూ ఆయన్ని కారులో తిప్పారట.. వేర్వేరు ప్రాంతాల్లో. అలాగని నారా లోకేష్ ఆరోపిస్తున్నారు. చివరికి ఆయన్నుంచి సంతకాలు తీసుకుని విడిచిపెట్టారట.
ఈ మొత్తం వ్యవహారంపై నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. ‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇద్దరు కూతుళ్ళున్నారు. మీ కుటుంబానికి ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇలాగే స్పందిస్తారా..’ అంటూ లోకేష్ మండిపడ్డారు. విద్యార్థిని రమ్య హత్య అత్యంత దారుణం. ఆ ఘటనపై రాజకీయ విమర్శలు చేసే క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుమార్తెల ప్రస్తావన ఎందుకు వచ్చింది.? అన్నది అసలు చర్చ.
ఈ విషయంలో నారా లోకేష్, తన స్థాయిని దిగజార్చేసుకున్నారు.. ఇందులో నో డౌట్. కానీ, ఇలాంటి విమర్శలు గతంలో వైసీపీ చాలానే చేసింది. సో, ‘టిట్ ఫర్ టాట్’ (కుక్క కాటుకి చెప్పు దెబ్బ) అని సరిపెట్టుకోవాలేమో. నిజానికి, ఈ ఒక్క ఘటనకు సంబంధించిన చర్చ కాదిది. సుగాలి ప్రీతి విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసింది.? చాలా ఏళ్ళ క్రితం అయేషా మీరా అనే మైనార్టీ బాలిక విషయంలో ఏం జరిగింది.? రాజకీయ పార్టీలు రాజకీయాలే చేస్తాయి. బాధిత కుటుంబాలకి మాత్రం ఎప్పుడూ న్యాయం జరగదుగాక జరగదు.
దిశ పేరుతో చట్టం తెచ్చిన సగన్ సర్కార్, రమ్య పేరుతో కొత్త చట్టం తీసుకురాగలదా.? సుగాలి ప్రీతి పేరు ‘దిశ పబ్లిసిటీ’ విషయంలో ఎందుకు వాడటంలేదు.? అయేషా మీరా పేరుతో చట్టాలెందుకు రూపొందలేదు.? అదంతే.. ఈ రాజకీయం ఇంతే.