విపత్తు ఎప్పుడైనా కొత్త అవకాశాల్ని కల్పిస్తుంది. సంక్షోభం ఎదురైన ప్రతిసారి సరికొత్త దారులు కూడా ఏర్పడతాయి. కరోనా మహమ్మారి దెబ్బకు యావత్ ప్రపంచమంతా అతలాకుతలమైపోవటమే కాదు.. రానున్న మరికొద్ది నెలలు పాటు ఇలాంటి పరిస్థితే ఉంటుందన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. చూస్తుండగానే సెకండ్ వేవ్ ముగిసి.. థర్డ్ వేవ్ పలు దేశాల్ని చుట్టుముట్టి తెగ ఇబ్బంది పెట్టేస్తోంది.
ఈ లెక్కన ఇంకెన్ని వేవ్ ల్ని ఫేస్ చేయాలన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. కరోనా కారణంగా చోటు చేసుకున్న లాక్ డౌన్ తో భారీగా నష్టపోయిన పరిశ్రమల్లో వినోద పరిశ్రమ మొదటి స్థానంలో నిలుస్తుందని చెప్పాలి. అందులోనే సినిమాలకు తగిలిన దెబ్బ అంతా ఇంతా కాదు.
అయితే.. థియేటర్లలో సినిమాలకు బదులు.. ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద సినిమాలు విడుదల కావటం.. పలు సినిమాలకు సరికొత్త ప్లాట్ ఫాం దొరికినట్లైంది. దీంతో.. పలువురు పెద్ద హీరోల చిత్రాలు ఈ వేదిక మీద విడుదలయ్యాయి. అయితే.. తెలుగులో మాత్రం తొలిసారి ఒక అగ్రహీరో సినిమా ఓటీటీలో విడుదలై చరిత్ర వెంకటేశ్ నటించిన రీమేక్ మూవీ ‘నారప్ప’తో మొదలైందని చెప్పాలి.
ఈ సినిమాను ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద విడుదల చేస్తున్నట్లు వెల్లడించిన వెంటనే.. చిత్ర పరిశ్రమలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. టాలీవుడ్ లో ఆగ్ర నిర్మాతల్లో ఒకరైన సురేశ్ బాబు.. తమ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్ ఫాం మీద విడుదల చేయటాన్ని పలువురునిర్మాతలు.. ఎగ్జిబిటర్లు వ్యతిరేకించారు.
అయితే.. ఈ సినిమాను తాము భాగస్వామ్యంతో తీశామని.. తనతో పాటు మరొక నిర్మాత కూడా ఉన్నారన్న పేరుతో ఓటీటీ విడుదలపై వెల్లువెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చుతూ విడుదలకు ఓకే అయ్యేలా చేశారు. భారీ చర్చ జరుగుతున్న వేళలోనే.. నారప్ప అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలైంది. పెద్ద ఎత్తున వీక్షకులు ఈ చిత్రాన్ని వీక్షిస్తున్నారు. ఈ సినిమాను అమెజాన్ ఎంత పెట్టి కొనుగోలు చేసింది? నిర్మాతలకు ఎంత ఆదాయం ముట్టింది? లాంటి వివరాలు పెద్దగా బయటకు రాలేదు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఓటీటీతో పాటు.. శాటిలైట్ రైట్స్ తో పాటు.. ఇతర స్ట్రీమ్ ల ద్వారా వచ్చే ఆదాయాన్ని పక్కన పెడితే.. అమెజాన్ ఒక్కతే నిర్మాతలకు రూ.40 కోట్ల ఫ్యాన్సీ ధరకు సినిమాను సొంతం చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈ డీల్ తో నిర్మాతలకు రూ.17 కోట్ల లాభం వచ్చిందని చెబుతున్నారు. థియేటర్లలో నేరుగా విడుదల చేసి.. సినిమా టాక్ ఆధారంగా.. కలెక్షన్ల లెక్కలతో ప్రాఫిట్ లెక్కలు వేసుకునే కన్నా.. ఓవర్ ద టేబుల్ మీద లెక్కను ఫైనల్ చేసుకొని.. హ్యాపీగా లాభాల్ని ఎంజాయ్ చేయొచ్చన్న మాట వినిపిస్తోంది. ఓటీటీ ప్లాట్ ఫాం మీదనే ఇలాంటి వెసులుబాటు ఉంటుందని చెబుతున్నారు.
నారప్ప నిర్మాతలతో అమెజాన్ డీల్ లో నిజానిజాలు ఎంతన్న దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. నిప్పు లేనిదే పొగ రాదన్న సామెతకు తగ్గట్లు.. ఈ మాత్రం డీల్ జరగకుండానే.. వివరాలు బయటకు వస్తాయా? అన్న మాట వినిపిస్తోంది. మరి.. ఈ వార్తలపై నారప్ప నిర్మాతలు ఎలా రియాక్టు అవుతారో చూడాలి.