దేన్నయినా వక్రీకరించడంలో వైసీపీ అధినాయకత్వానికి ప్రత్యేకమైన నైపుణ్యం వుంది. ‘ఏకగ్రీవాల విషయమై ప్రత్యేకంగా దృష్టి పెడతాం..’ అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెబితే, దానికి నానా రకాల వక్రభాష్యాలూ చెప్పారు వైసీపీ నేతలు. అంతేనా, వైసీపీ ప్రభుత్వం అయితే.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని తెలిసీ, ఏకగ్రీవాలకు మద్దతుగా జీవో పాస్ చేయడమే కాదు, పత్రికలకు ప్రకటనలు కూడా ఇచ్చింది. ఈ వ్యవహారంపై సంబంధిత శాఖకు చెందిన కమిషనర్‌కి శ్రీముఖం పంపినట్లు ఎస్ఈసీ నిమ్మగడ్డ మీడియా సమావేశంలో చెప్పారు.
గ్రామాల్లో ఓ మంచి వ్యక్తిని ఎన్నుకునే క్రమంలో ఏకగ్రీవానికి గ్రామ ప్రజలందరూ ముందుకొస్తే, దాన్ని ఎవరూ తప్పుపట్టబోమనీ, ఎంపీటీసీ – జెడ్పీటీసీ ఎన్నికల సందర్బంగా ఏకగ్రీవాలు జరిగినప్పుడు చాలా ఆరోపణలు వచ్చిన దరిమిలా, పంచాయితీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని నిమ్మగడ్డ స్పష్టతనిచ్చారు. పరిధికి మించి ఏకగ్రీవాలు జరిగితే అనుమానం ఖచ్చితంగా వస్తుందన్నది నిమ్మగడ్డ అభిప్రాయం.
ఇక, పంచాయితీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేదీ, పంచాయితీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్‌లపై ఎస్ఈసీ చర్యలంటూ జరుగుతున్న ప్రచారంపైనా నిమ్మగడ్డ క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వ పెద్దలు, వారిని బదిలీ చేస్తున్నట్లుగా ప్రకటించేశారనీ, అయితే తాను వారిపై అలాంటి చర్యలు కోరలేదనీ, విధి నిర్వహణలో అలసత్వానికి సంబంధించి చిన్న హెచ్చరిక చేయడం ద్వారా వారి సర్వీసు క్వాలిటీ మెరుగుపరచుకోవడానికి అవకాశం కల్పించాను తప్ప, వారిని తొలగించాలనుకోలేదని నిమ్మగడ్డ చెప్పుకొచ్చారు. ఇది నిజంగానే పెద్ద ట్విస్ట్.
దాదాపుగా అధికారులంతా తనకు సహకరిస్తున్నారనీ, ఎవరి మీదా తనకు ప్రత్యేకమైన ద్వేషం లేదనీ, అన్ని విషయాలూ గవర్నర్‌తో చర్చించడంతోపాటుగా, ఆయా అధికారులతోనూ గ్యాప్ తొలగించుకునేందుకు ప్రయత్నించానని అన్నారు నిమ్మగడ్డ. తాజాగా జరిగిన వీడియో కాన్ఫరెన్స్ కూడా గిరిజా శంకర్ ద్వారానే నిర్వహించినట్లు నిమ్మగడ్డ చెప్పడం గమనార్హం.
‘నేనూ సర్వీసెస్ నుంచి వచ్చినవాడినే.. నాకూ అన్ని విషయాలపైనా అవగాహన వుంది. ప్రభుత్వ పెద్దలు పరిధి దాటి మాట్లాడుతున్నారు. సీనియర్ అధికారులతో ఎస్ఈసీకి గ్యాప్ ఏమీ లేదు. సీఎస్, డీజీపీ.. నిబద్ధత గల అదికారులు..’ అని నిమ్మగడ్డ వ్యాఖ్యానించడం గమనార్హం.