Advertisement

జస్ట్ ఆస్కింగ్: ప్రజా తీర్పుని వక్రీకరిస్తున్నదెవరు.?

Posted : February 15, 2021 at 12:03 pm IST by ManaTeluguMovies

పంచాయితీ ఎన్నికల సందర్భంగా అధికార వైసీపీ కి, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కీ మధ్య ‘కామెడీ పోరాటం’ జరుగుతోంది. ‘నువ్వు కొట్టినట్లు నటించు, నేను ఏడ్చినట్లు నటిస్తాను..’ అనే ఓ ఖచ్చితమైన అవగాహనతో ఇరు పార్టీలూ రాజకీయం చేస్తున్నట్లే కనిపిస్తోంది పరిస్థితి. లేకపోతే, పంచాయితీ ఎన్నికల్లో మేమే గెలిచాం.. అంటే మేమే గెలిచాం.. అని జబ్బలు చరుచుకుని ఊరుకోకుండా, ‘నీ లెక్కలు తప్పు.. కాదు, నీ లెక్కలే తప్పు..’ అంటూ అర్థం పర్థం లేకుండా రచ్చకెక్కడమేంటి.? నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్టుంది రెండు ప్రధాన పార్టీల తీరు రాష్ట్రంలో.

పంచాయితీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రత్యక్ష ప్రమేయం వుండదని.. ఈ రెండు ప్రధాన పార్టీలకు తెలియదా.? పార్టీలకతీతంగా జరగాల్సిన ఎన్నికలివి.. అందుకే, ఏకగ్రీవాలతో గ్రామాభివృద్ధికి పాటుపడండి.. అని వైసీపీ ప్రభుత్వమే పత్రికల్లో ప్రకటనలు గుప్పించింది. చెప్పేవి శ్రీరంగ నీతులు.. దూరేవి డాష్ డాష్.. అన్న చందాన, పంచాయితీ ఎన్నికల ఫలితాలు రాగానే.. పార్టీల జెండాల్ని గెలిచిన వారి మీద కప్పేస్తున్నాయి ఇటు టీడీపీ, అటు వైసీపీ.

రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించో.. కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఒప్పించో.. పార్టీల గుర్తుల మీద పంచాయితీ ఎన్నికలు నిర్వహించి వుంటే.. టీడీపీ, వైసీపీ బండారం బయటపడిపోయేది. ఓ వైపు పార్టీల జెండాలు, గుర్తులతో ప్రమేయం లేని ఎన్నికలని రెండు పార్టీలూ చెబుతూనే, ఇంకోపక్క ‘మేమే గెలించాం..’ అని చెప్పడమేంటి.? పైగా, ‘ప్రజా తీర్పుని వక్రీకరిస్తున్నారు..’ అంటూ మీడియాకెక్కి నిస్సిగ్గుగా ప్రకటనలు గుప్పిస్తున్నారు రెండు ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నేతలు.

తామేదో గొప్ప రాజకీయం చేసేస్తున్నామని ఇరు పార్టీలూ అనుకోవచ్చుగాక. కానీ, ప్రజలకు అన్నీ అర్థమవుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో పార్టీల జెండాల్లేవు.. బ్యాలెట్ పేపర్ల మీద పార్టీల గుర్తుల్లేవు.. మరి, ఫలితాల్ని వక్రీకరిస్తున్నదెవరు.? ఈ విషయంలో మాత్రం వైసీపీ, టీడీపీ ఖచ్చితమైన అవగాహనతో వున్నట్లే కనిపిస్తోంది. వైసీపీ ముఖ్య నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, టీడీపీని గట్టిగా నిలదీసేయడం.. ఈ క్రమంలో టీడీపీ ప్రచారంలోకి తెచ్చిన ఫేక్ ఫలితాల వెబ్‌సైట్ గురించి పేర్కొనడం.. ఇవన్నీ జస్ట్ పొలిటికల్ డ్రామాని తలపిస్తున్నాయంతే.


Advertisement

Recent Random Post:

Gold Price Jumps to Record High after US Fed Rate Cut | పెరగనున్న బంగారం ధరలు

Posted : September 19, 2024 at 12:37 pm IST by ManaTeluguMovies

Gold Price Jumps to Record High after US Fed Rate Cut | పెరగనున్న బంగారం ధరలు

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad