ఒకదాన్ని మించిన ప్రకటన ఇంకోటి వస్తోంది 20 లక్షల కోట్ల రూపాయల విలువైన ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ ప్యాకేజీకి సంబంధించి. కరోనా వైరస్ నేపథ్యంలో దేశం విలవిల్లాడుతున్న వేళ, ప్రధాని నరేంద్ర మోడీ 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ.. అంటూ తీపి కబురు అందించారు దేశ ప్రజానీకానికి. కానీ, ఇది కేవలం లెక్కల మాయ.. అని తేలడానికి పెద్దగా సమయం పట్టలేదు. లాక్‌డౌన్ మొదలయ్యాక సుమారు లక్షన్నర కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం, దాన్ని ఈ ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’లో కలిపేయడంతోనే అందరికీ ఈ స్పెషల్ ప్యాకేజీలో ‘పస’ ఎంతో తెలిసిపోయింది.
అయినాగానీ, ఏదో చిన్న ఆశ.. తమ కోసం కేంద్రం ఏదో చేసేస్తుందని దేశ ప్రజానీకం ఎదురుచూశారు. మొదటి రోజు కేంద్ర మంత్రి నిర్మలా సీతారమన్, ప్యాకేజీపై వివరణ.. వెల్లడించిన అంశాలు అందర్నీ షాక్‌కి గురిచేశాయి. రెండో రోజూ అదే పరిస్థితి. మూడో రోజు కూడా సేమ్ టు సేమ్. నాలుగో రోజైతే మరీ ఆశ్చర్యం. రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల శాతాన్ని పెంచుతూ ప్రకటన చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అంతే కాదు, స్పేస్ రంగంలో కూడా ప్రైవేటు సంస్థల్ని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారామె.
ప్యాకేజీ అదిరిపోయింది కదూ.! విషయం ఇంకా వుంది. కేంద్ర పాలిత ప్రాంతాల్లో విద్యుత్ పంపిణీ వ్యవస్థని ప్రైవేటు పరం చేస్తున్నట్లూ నిర్మలమ్మ సెలవిచ్చారు. ఇది ఇంకా అద్భుతం మరి. అసలు, ప్యాకేజీ అంటే ఏంటి.? ప్రజలు ఆ ప్యాకేజీ నుంచి ఏం ఆశిస్తున్నారు.? అనే ఆలోచనే లేకుండా ఏకంగా 20 లక్షల కోట్ల ప్యాకేజీ తయారైనట్లు కన్పిస్తోంది. ఆయా రంగాలకు ప్రోత్సాహకాలంటారు.. ‘లోన్లు’ చుట్టూ మాట్లాడతారు.. దీన్ని ప్యాకేజీ అనుకోవాలంటే ఎలా.?
సగటు భారతీయుడు, లాక్‌డౌన్ నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయాడు. ‘ఈ పరిస్థితుల్లో నాకు కేంద్రం ఏమిస్తుంది.?’ అన్నది మాత్రమే సగటు భారతీయుడికి కావాలి. ‘సారీ, అక్కడ కేంద్రం ఇచ్చేదేమీ లేదు.. కావాలంటే అప్పులు ఇప్పిస్తుంది..’ అన్నట్లు వ్యవహరిస్తున్నారు కేంద్ర ప్రభుత్వ పెద్దలు. ఆ అప్పులు గ్రౌండ్ లెవల్‌లో ఎంత గొప్పగా సామన్యులకు దక్కుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొత్తమ్మీద, నాలుగో ఆణిముత్యం.. అదేనండీ ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ నాలుగో అధ్యాయం మరీ దారుణంగా నిరాశపర్చింది. ఇంకెన్ని ఆణిముత్యాలు కేంద్రం నుంచి వెలువడనున్నాయో ఏమో.!