భారత్ -చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకున్న నేపథ్యంలో మోడీ సర్కార్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకొంది. ఇందులో భాగంగా చైనాకు సంబంధించిన కొన్నింటిని నిషేధించింది. అందులో టిక్‌టాక్ యాప్ ఒకటి. టిక్‌టాక్‌ను నిషేధించడాన్ని చాలా మంది సినీ సెలబ్రిటీలు ప్రశంసించారు. అయితే ఒక గళం మాత్రం మోడీ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది.
టిక్‌టాక్ కేవలం ఒక ఎంటర్‌టైన్‌మెంట్ యాప్ అని, దాన్ని నిషేధించడం దుందుడుకు నిర్ణయమని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, సినీ నటి నుస్రత్ జహాన్ అన్నారు. భారత్ సరిహద్దులోకి చొచ్చుకొస్తున్న చైనా దుశ్చర్యలను తిప్పికొట్టే వ్యూహాత్మక ప్రణాళిక ఏంటని మోడీ సర్కార్‌ను ఆమె ప్రశ్నించారు.
దేశ భద్రత దృష్ట్యా టిక్‌టాక్‌ను నిషేధించడంపై తనకు ఎలాంటి అభ్యంతర లేదన్నారు. కానీ టిక్‌టాక్‌ను నిషేధించడం వల్ల ఉపాధి కోల్పోయిన వారి పరిస్థితి ఏంటని ఆమె నిలదీశారు. నోట్ల రద్దు సమయంలో ఎలాగైతే భారతీయులు ఇబ్బంది పడ్డారో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆమె చెప్పారు. కాగా నుస్రత్ జహాన్ దాదాపు 20 చిత్రాల్లో నటించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బసిర్హట్ పార్లమెంట్ స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్ తరపున ఎన్నికయ్యారు.