ప్రస్తుతం కరోనా కారణంగా ఫిలిం ఇండస్ట్రీ చాలా స్ట్రగుల్ అవుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే కొన్ని వందల కోట్లు నష్టపోయింది. థియేటర్లు ఓపెన్ అవ్వడానికి మరో రెండు లేదా మూడు నెలలు ఈజీగా పట్టే అవకాశం ఉంది. నిర్మాతలకు సినిమాలు విడుదలైతే కానీ ఊరట లభించే అవకాశం లేదు. ఇక ఇప్పటికే వందల కోట్లు నష్టపోయిన నిర్మాతలు తిరిగి పూర్తి స్థాయిలో కోలుకోవాలంటే సినిమా బడ్జెట్ లు తగ్గడం తప్పనిసరి. ఇందుకోసం హీరోలు, హీరోయిన్లు, దర్శకులు తమ పారితోషికం తగ్గించుకోవడం ఒక మార్గం. ఇప్పటికే కొందరు హీరోలు, దర్శకులు తమ పారితోషికం తగ్గించుకుంటున్నట్లు మిగతా ఇండస్ట్రీలలో ప్రకటించారు.
టాలీవుడ్ లో ఈ తరహా వార్తలు వచ్చినా ఇంకా అధికారికంగా ఎక్కడా వెల్లడించలేదు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబుతో సర్కారు వారి పాటను తెరకెక్కిస్తున్న పరశురామ్ తన పారితోషికాన్ని తగ్గించుకున్నట్లు సమాచారం. సర్కారు వారి పాటకు ముందు పరశురామ్ పారితోషికం 4 నుండి 6 కోట్లకు మధ్య ఉండగా మహేష్ తో సినిమా అవకాశాన్ని దక్కించుకున్నాక పారితోషికాన్ని 10 కోట్లకు పెంచేసాడు పరశురామ్.
అయితే ఈలోగా కరోనా కారణంగా నిర్మాతలు నష్టపోవడంతో మళ్ళీ తన నిర్ణయంలో మార్పు చేసుకున్నాడట. సర్కారు వారి పాటకు ఇప్పుడు 10 కోట్ల నుండి 7 కోట్లకు తగ్గించుకోవడం విశేషం. ఇది చూసి మిగతా దర్శకులు కూడా మార్పు చేసుకుంటారేమో చూడాలి.