పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ చిత్రంను చేస్తున్నాడు. రెండేళ్ల తర్వాత పవన్ నుండి రాబోతున్న సినిమా అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. బాలీవుడ్లో హిట్ అయిన పింక్‌కు వకీల్ సాబ్ చిత్రం రీమేక్ అనే విషయం అందరికి తెల్సిందే. ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తూ ఉండగా వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ రాత్రి సమయంలో జరిగేది, డే టైంలో పార్టీ కార్యక్రమాల్లో పవన్ పాల్గొనేవాడు అంటూ గతంలో వార్తలు వచ్చాయి, ఇక శృతిహాసన్ ఈ చిత్రంలో ఉందా లేదా అనే విషయంలో కూడా చాలా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలన్నింటిపై దర్శకుడు వేణు శ్రీరామ్ క్లారిటీ ఇచ్చాడు.
వకీల్ సాబ్ చిత్రం మరో నెల రోజుల వర్క్ బ్యాలన్స్ ఉంది. లాక్డౌన్ పూర్తి అయిన వెంటనే ఆ పని మొదలు పెడతాం అన్నాడు. విడుదల విషయంలో ఇప్పట్లో క్లారిటీ ఇవ్వలేనన్నాడు. ఇక ఈ చిత్రం షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ గారి డెడికేషన్‌ను చూసి ఆశ్చర్యపోయాను అన్నాడు. సాయంత్రం సమయంలో విజయవాడ నుండి హైదరాబాద్‌కు ఆయన వచ్చి రాత్రి అంతా కూడా ఫుల్ ఎనర్జితో నటించేవారు. ఇతరులను కూడా ఆయన ఉత్సాహపర్చుతూ షూటింగ్లో పాల్గొనేవారు.
తెల్లారి ఉదయం విజయవాడకు వెళ్లేవారు. అలా చాలా రోజుల పాటు షూటింగ్ చేశామని దర్శకుడు చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా నుండి శృతిహాసన్ తప్పుకుందనే విషయంలో కూడా నిజం లేదన్నాడు. లాక్డౌన్ పూర్తి అయిన తర్వాత పవన్ కళ్యాణ్, శృతిహాసన్‌ల కాంబినేషన్లో ఒక పాట సన్నివేశాలను చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా పేర్కొన్నాడు. ఈ చిత్రం లేడీ ఓరియంటెడ్ కథాంశంతో రూపొందినా కూడా మాస్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించేందుకు వకీల్ సాబ్ అనే టైటిల్‌ను పెట్టినట్లుగా ఆయన పేర్కొన్నాడు.