జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు బీజేపీ పెద్దల్ని కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వివాదం నేఫథ్యంలో ఢిల్లీకి వెళ్ళిన పవన్, ఢిల్లీ పెద్దలతో ఏం మాట్లాడుతున్నారు.? ఢిల్లీ నుంచి ఏం హామీ తీసుకురాబోతున్నారు.? అన్న ఉత్కంఠ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది. అయితే, ‘ఢిల్లీ పెద్దలు సానుకూలంగా స్పందించారు’ అని మాత్రమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పగలుగుతున్నారు.
రాష్ట్రంలో శాంతి భద్రతల అంశం సహా, తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి జరగబోయే ఉఫ ఎన్నిక, ఇతరత్రా అనేక కీలక అంశాలు పవన్ ఢిల్లీ టూర్‌లో చర్చకు వచ్చాయట. దేశంలో మిగతా పరిశ్రమల్లో డిజిన్వెస్టిమెంటుకీ, విశాఖ ఉక్కు వ్యవహారానికీ తేడా వుందనీ, విశాఖ ఉక్కు రాష్ట్ర ప్రజల సెంటిమెంటుతో ముడి పడి వున్న అంశమనీ పవన్ కళ్యాణ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి తెలిపారట.
ఇక, విశాఖ ఉక్కు పరిశ్రమను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా వుందంటూ వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి చేసిన ప్రకటనపై స్పందించిన జనసేన నేత నాదెండ్ల మనోహర్, ఆ విషయమై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి వుందన్నారు. ‘వైసీపీకి పెద్ద సంఖ్యలో ఎంపీలు వున్నారు.. వాళ్ళు చెయ్యాలనుకుంటే చాలా చెయ్యవచ్చు. లేఖ రాస్తే సరిపోదు. ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకెళ్ళేలా ముఖ్యమంత్రి చొరవ చూపాలి’ అని జనసేన అంటోంది.
అయితే, జనసేన ఢిల్లీ టూర్ సందర్భంగా ఉక్కు పరిశ్రమపై ఎలాంటి సానుకూల స్పందన వచ్చిందనుకోవడానికి వీల్లేదన్న చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతోంది. అయితే, జనసేనాని ప్రయత్నాన్ని మాత్రం రాజకీయ విశ్లేషకులు స్వాగతిస్తున్నారు. ‘నిజానికి ఈ సందర్భంలో ముఖ్యమంత్రి చొరవ చూపించాలి. సుదీర్ఘ రాజకీయ అనుభవం వుందని చెప్పుకునే చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. కానీ, ఆ ఇద్దరూ రాష్ట్రానికే పరిమితమైపోతే, ఉక్కు పరిశ్రమ విషయమై రాష్ట్ర ప్రజల సెంటిమెంటుని కేంద్రం దృష్టికి తీసుకెళ్ళడంలో జనసేనాని సఫలమయ్యారు..’ అన్నది రాజకీయ పరిశీలకుల భావన.
అయితే, అమరావతి విషయంలో ఎలాగైతే కేంద్ర ప్రభుత్వ పెద్దల నుంచి జనసేనానికి హామీ వచ్చిందో.. అలాంటి హామీనే విశాఖ ఉక్కు విషయంలో వచ్చిందిగానీ.. ఈ విషయాల్ని సదరు కేంద్ర ప్రభుత్వ పెద్దలే అధికారికంగా ప్రకటించి వుంటే బావుండేదేమో.!