అది పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం.. అందులో ఓ చిన్న గ్రామం.. దాని పేరు మత్స్యపురి. అధికార వైసీపీ ఎన్ని పిల్లిమొగ్గలేసినా, అక్కడ జనసేన జెండా ఎగిరింది పంచాయితీ ఎన్నికల్లో. ఇంకేముంది.? ఎలాగైనా, అక్కడి జనసైనికుల్ని భయపెట్టాలని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై అధిష్టానం నుంచి ఒత్తడి పెరిగినట్టుంది. లేదంటే, తన అహం దెబ్బతిందన్న కారణంతో అధిష్టానం వద్ద తన ఇమేజ్ పెంచుకోడానికి, ఆ గ్రామంలో వైసీపీ గూండాలతో ‘కవాతు’ చేయించినట్టున్నారు సదరు ఎమ్మెల్యే.
‘పవన్ కళ్యాణ్ వస్తాడో.. డాష్ డాష్ బాబు వస్తాడో చూస్తా.. గ్రామంలో జనసైనికుడనేవాడే లేకుండా చేస్తా.. మీకెవడ్రా దిక్కు ఇక్కడ..’ అంటూ పరుష పదజాలంతో విరుచుకుపడిపోయారు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి సోషల్ మీడియాలో వీడియోలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ, ‘అక్కుపక్షి’ మీడియా (అధికార పార్టీకి చెందిన బులుగు మీడియా) కులం రంగు పులిమింది. దళితులపై దాడులనీ, అంబేద్కర్ విగ్రహం మెడలో చెప్పుల దండ అనీ.. అటు వైసీపీ, ఇటు వైసీపీ అను‘కుల’మీడియా కథనాల్ని వండి వడ్డించింది.
గ్రామంలో అసలంటూ జనసైనికులు వుండకూదన్న రీతిలో అక్కడ అత్యంత జుగుప్సాకరమైన, భయానకమైన పరిస్థితుల్ని అధికార పార్టీ పెంచి పోషిస్తోంది. ఈ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ‘మనం రోడ్డు మీదకు వెళ్ళేటప్పుడు కొన్ని కుక్కలు అరుస్తాయి.. కొన్ని పిచ్చి కుక్కలు కరుస్తాయి. పిచ్చి కుక్క కరిచింది కదా అని మనం తిరిగి కరవం కదా.. మునిసిపాలిటీ వ్యాన్ వచ్చేవరకు వేచి చూసి, పిచ్చి కుక్కని మునిసిపాలిటీ వ్యాన్‌లో పడేస్తాం..’ అలాగే, ఇప్పుడు కూడా సంయమనం పాటించండి.. అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసైనికులకు పిలుపునిచ్చారు.
‘మా పార్టీకి చెందినవారిపై అడ్డగోలుగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.. ఆ ఒత్తిళ్ళకు పోలీసులు లొంగకూడదు..’ అంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కి విజ్ఞప్తి చేశారు జనసేనాని. ‘ప్రత్యర్థులను హింసించడమే వైసీపీ నేతల పని. 151 మంది ఎమ్మెల్యేలు ప్రజలకు సేవ చేయాల్సింది పోయి.. ప్రజల్ని హింసించే పనిలో వున్నారు..’ అంటూ జనసేన అధినేత మండిపడ్డారు. ‘ఆయనో ఆకు రౌడీ, బ్యాంకులను దోచేసే వ్యక్తి.. ఆయన మంచిగా ప్రవర్తిస్తాడని మనం ఆశించలేం’ అని జనసేనాని ఎద్దేవా చేశారు.