భారతీయ జనతా పార్టీ ఆంధ్రపదేశ్ శాఖకి సంబంధించిన ట్విట్టర్ హ్యాండిల్ చూస్తే, ప్రొఫైల్ పిక్ స్థానంలో తిరుపతి ఉప ఎన్నిక వ్యవహారం, జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థిని గెలిపిద్దామన్న ప్రస్తావన కనిపిస్తాయి. ఓ రాజకీయ పార్టీ తన ట్విట్టర్ హ్యాండిల్ ప్రొఫైల్ కోసం మిత్రపక్షమే అయినా ఇంకో పార్టీ పేరుని ప్రస్తావించడం ఆశ్చర్యకరమే.
ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రస్తుత పరిస్థితి ఏంటి.? అన్న ప్రశ్నకు సమాధానం ఇక్కడే చాలామందికి దొరికేసింది. బీజేపీకి రాష్ట్రంలో కొందరు ప్రజా ప్రతినిథులున్నారు. ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యలు బీజేపీకి వుండగా, జనసేన పార్టీకి వున్నది ఒకే ఒక్క ఎమ్మెల్యే.. పైగా ఆ ఎమ్మల్యే కూడా అధికార పార్టీలోకి దూకేశారాయె.
దుబ్బాక, గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల సమయంలోనే కాదు, తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ, జనసేనను అవమానించింది. జనసేన తమకు మిత్రపక్షమే కాదని బీజేపీ తేల్చేసింది. కానీ, తిరుపతికి వచ్చేసరికి సీన్ మారింది. సొంత ఇమేజ్ తిరుపతిలో బీజేపీకి పనిచెయ్యదు. అందుకే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫొటో పెట్టుకుని ప్రచారం ముమ్మరం చేసింది. ‘జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థి..’ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు బీజేపీ నేతలు. ఎవరా అభ్యర్థి.? అని మాత్రం అడక్కూడదు. అది ప్రస్తుతానికి టాప్ సీక్రెట్.
అయితే, జనసేన నాయకులెవరూ తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా ఇంతవరకు కనిపించడంలేదు. జనసేన అధిష్టానం ఆ దిశగా బహుశా తమ పార్టీ శ్రేణులకు ‘తగిన దిశా నిర్దేశం’ చేసిందనే ప్రచారం జరుగుతోంది. ‘జనసేన మీకు మిత్రపక్షమేనా.?’ అని తిరుపతి నియోజకవర్గంలో కొన్ని చోట్ల బీజేపీ నేతలకు, ఓటర్ల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయట. దాంతో, బీజేపీ శ్రేణులే, తమ పార్టీ జెండాలతోపాటు, జనసేన జెండాలు కూడా తీసుకెళ్ళాల్సి వస్తోందట.
మిత్రపక్షంతో సంప్రదింపులు జరపకుండా తొలుత ‘మేమే పోటీ చేస్తాం’ అన బీజేపీ ప్రకటించడమే అన్ని సమస్యలకూ కారణంగా కనిపిస్తోంది. ఆ తర్వాత దిద్దుబాటు చర్యలు చేపట్టినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.