Advertisement

పోలవరం పునరావాసంపై గళం విప్పిన జనసేనాని పవన్

Posted : March 26, 2021 at 11:10 pm IST by ManaTeluguMovies

‘పోలవరం ముంపు నిర్వాసితులను పునరావాసం కల్పించాకే తరలించాలి’ అంటూ డిమాండ్ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా సర్వం కోల్పోతున్నవారికి పునరావాసం అత్యంత కీలకం. అయితే, పునరావాసం విషయమై గత చంద్రబాబు ప్రభుత్వంగానీ, ప్రస్తుత జగన్ ప్రభుత్వంగానీ బాధ్యతగా వ్యవహరించడంలేదు. టీడీపీ, వైసీపీ.. రెండూ పోలవరం ప్రాజెక్టు పేరుతో చేసేవి, చేస్తున్నవీ పబ్లిసిటీ స్టంట్లు మాత్రమే. ప్రతిపక్షంలో వున్నప్పుడు టీడీపీ, వైసీపీ పునరావాసం కోసం నినదించడం, అధికారంలోకి వచ్చాక, ముంపు బాధితుల్ని పట్టించుకోకపోవడం షరామామూలు తంతుగా మారిపోయింది. ఈ విషయాన్ని బాధితులే చెమర్చిన కళ్ళతో చెబుతున్నారు.

ముంపు ప్రాంతాల్లో బాధితుల వెతల్ని జనసైనికులు ఎప్పటికప్పుడు అధికారులకు తెలియజేసేందుకు ప్రయత్నిస్తూనే వున్నారు. తాజాగా జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్, ముంపు ప్రాంతాల ప్రజల వెతల్ని తెలుసుకున్నారు.. అధినేత ముందు ఆ విషయాల్ని నివేదిక రూపంలో వుంచారు. పునరావాసం కల్పించకుండా బాధితుల ఇళ్ళను కూల్చేస్తున్నారనీ, బాధితుల ఇళ్ళకు విద్యుత్ సౌకర్యాన్ని తొలగిస్తున్నారనీ, ఈ అంశాలు తనను తీవ్రంగా కలచివేశాయని జనసేన అధినేత వ్యాఖ్యానించారు. మానవ హక్కుల్ని హరించేలా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు అత్యంత బాధాకరమన్న పవన్ కళ్యాణ్, బాధితుల వెతలపై మానవ హక్కుల కమిషన్ వద్ద ఫిర్యాదు చేస్తామని జనసేన అధినేత హెచ్చరించారు.

వెంటనే, ముంపు ప్రాంతాల ప్రజలకు సరైన పునరావాసం కల్పించాలనీ, పునరావాసం కోసం నిర్మించిన ఇళ్ళు కాలనీల వద్ద మౌళిక వసతులు కల్పించాలనీ, నాసిరకం ఇళ్ళ విషయమై ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని జనసేన అధినేత డిమాండ్ చేశారు. బాధితుల వెతలపై స్పందిస్తున్న జనసేన నేతలు, జనసైనికుల్ని పవన్ కళ్యాణ్ అభినందించారు. ముంపు బాధితులకు 10 లక్షలు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇస్తామని గతంలో చెప్పిన వైఎస్ జగన్, ముఖ్యమంత్రి అయ్యాక 6.8 లక్షలతో సరిపెడుతుండమేంటని జనసేన అధినేత ప్రశ్నించారు.


Advertisement

Recent Random Post:

పన్నెండేళ్లుగా జైలులో ఉన్న భానుకిరణ్‌| Maddelacheruvu Suri Case | Bhanu Kiran Released From Jail

Posted : November 7, 2024 at 11:51 am IST by ManaTeluguMovies

పన్నెండేళ్లుగా జైలులో ఉన్న భానుకిరణ్‌| Maddelacheruvu Suri Case | Bhanu Kiran Released From Jail

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad