తన రీఎంట్రీకి ఎవ్వరూ ఊహించని ఓ సినిమాను ఎంచుకున్నాడు పవన్ కళ్యాణ్. హిందీలో విజయవంతమైన ‘పింక్’ సినిమా రీమేక్‌లో ఆయన నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా చూసిన వాళ్లెవ్వరూ పవన్ లాంటి మాస్ హీరో దీని రీమేక్‌లో నటిస్తాడని అనుకోరు. హిందీలో అమితాబ్ బచ్చన్ చేసిన లాయర్ పాత్రలో పవన్ కనిపించనున్నాడు.
ఒరిజినల్లో ఆ పాత్రలో ఎంతమాత్రం హీరోయిజం ఉండదు. పంచ్ డైలాగులు, ఫైట్లకు ఛాన్సే కనిపించదు. అలాంటి పాత్రను పవన్ తెలుగులో చేయడం ఏంటన్న ప్రశ్న చాలామందిలో తలెత్తింది. ఐతే తమిళంలో ఇదే సినిమాను అజిత్ హీరోగా కొంచెం హీరోయిజం జోడించి తీశారు. మంచి ఫలితమే అందుకుంది. తెలుగులోకి వచ్చేసరికి ఇంకా హీరోయిజం యాడ్ చేసినట్లే ఉన్నారు. ఈ చిత్ర సంగీత దర్శకుడు తమన్ చెబుతున్న మాటల్ని బట్టి చూస్తే అదే అనిపిస్తోంది.
ఓ ఇంటర్వ్యూలో ‘వకీల్ సాబ్’ మ్యూజిక్ గురించి మాట్లాడాడు తమన్. పవన్ సినిమా అంటే అంచనాలు భారీగా ఉంటాయని.. ‘వకీల్ సాబ్’ కొంచెం గ్యాప్ తర్వాత వస్తోంది కాబట్టి అభిమానుల అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయని తమన్ చెప్పాడు. ఐతే పవన్ అభిమానులు ఇందులో హీరోయిజం గురించి, ఎలివేషన్ల గురించి సందేహాలేమీ పెట్టుకోవాల్సిన పని లేదని.. పవన్ హీరోయిజానికి, స్టార్ పవర్‌కు తగ్గని విధంగా సంగీతం ఉంటుందని.. అభిమానులకు కొన్ని సన్నివేశాల్లో గూస్ బంప్స్ గ్యారెంటీ అని తమన్ అన్నాడు.
‘వకీల్ సాబ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘మగువా మగువా’కు మంచి రెస్పాన్స్ వచ్చిందని.. ఇందులో ప్రతి పాటా ఒక మైలురాయిలా ఉండాలి అనే ఉద్దేశంతో పని చేస్తున్నానని తమన్ చెప్పాడు. గత రెండు మూడేళ్లుగా సూపర్ ఫాంలో ఉన్న తమన్.. తొలిసారిగా పవన్ కళ్యాణ్ సినిమాకు పని చేస్తుండటంతో అతడి వర్క్ మీద భారీ అంచనాలే ఉన్నాయి.